'ధోనీ లేకుండా ఐపీఎల్ ను ఊహించుకోవడం కష్టం'
న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ల నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో మహేంద్ర సింగ్ సింగ్ ధోనీ ఐపీఎల్ కు దూరమైతే దాన్ని ఊహించుకోవడం కష్టసాధ్యమని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పష్టం చేశాడు. గత కొన్నిసంవత్సరాలుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న ధోనీ.. ఒకవేళ ఏదైనా కారణం చేత ఐపీఎల్ లో ఆడకపోతే ఆ ఊహ నిజంగానే కష్టమని గవాస్కర్ తెలిపాడు.
ధోనీ లేకుండా ఐపీఎల్ ఎలా ఉంటుంది?అని మీడియా అడిగిన ప్రశ్నకు భారత్ క్రికెట్ లెజెండ్ పైవిధంగా స్పందించాడు. 'ప్రస్తుతం ధోనీ వయసు 34 సంవత్సరాలు. కొన్ని సంవత్సరాలుగా చెన్నై తరపున ఐపీఎల్ ఆడుతున్నాడు. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఐపీఎల్లో ధోనీ ఆడకపోతే అది చాలా కష్టం' అని గవాస్కర్ తెలిపాడు.
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై సుప్రీంకోర్టు రెండేళ్ల పాటు నిషేధం విధించడం.. ఆయా జట్ల ఆటగాళ్లను భీతావహమైన వాతావరణంలోకి నెడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ముగ్గురు జడ్జిలతో కూడా ధర్మాసనం తీర్పుపై భారత జట్టు తప్పకుండా సమాలోచన జరిపి తీరాలని గవాస్కర్ సూచించాడు.
మంగళవారం చెన్నై, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ల పాటు నిషేధం విధిస్తూ సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రాజేంద్ర మాల్ లోధా సారథ్యంలోని ముగ్గురు సభ్యుల కమిటీ తీర్పు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు నుంచే తీర్పు అమల్లోకి వస్తుందని వస్తుందని ప్రకటించింది.
చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ భాగస్వామి రాజ్ కుంద్రాపై జీవితకాల నిషేధం విధించింది. వీరిద్దరూ క్రికెట్ సంబంధిత వ్యవహారాల్లో పాల్గొనకుండా నిషేధం పెట్టింది. మేయప్పన్, కుంద్రా బెట్టింగ్ వ్యవహారాలతో బీసీసీఐ, ఐపీఎల్ తో పాటు క్రికెట్ కు చెడ్డ పేరు వచ్చిందని లోధా కమిటీ పేర్కొంది.