టీఎస్‌ఆర్టీసీకి 30 పతకాలు
జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ టోర్నీలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) బృందం సత్తా చాటింది. భారత మాస్టర్ అథ్లెటిక్స్ సమాఖ్య ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో జరిగిన ఈ టోర్నీలో 27 మందితో కూడిన టీఎస్‌ఆర్టీసీ జట్టు మొత్తం 30 పతకాలను సాధించింది. ఇందులో 4 స్వర్ణాలు, 7 రజతాలు, 19 కాంస్య పతకాలు ఉన్నాయి. మార్చి 24 నుంచి 27 వరకు జరిగిన ఈ టోర్నీలో మొత్తం 19 రాష్ట్రాలకు చెందిన అథ్లెట్లు పోటీపడ్డారు. ఈ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ జి.వి. రమణారావు పతకాలు సాధించిన అథ్లెట్లను శనివారం అభినందించారు.
బస్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రమణారావుతో పాటు క్రీడాధికారి, భారత వాలీబాల్ జట్టు మాజీ కెప్టెన్ వెంకట నారాయణ కూడా పాల్గొన్నారు. విధులు నిర్వర్తిస్తూనే ఉద్యోగులు క్రీడల్లో అద్భుతంగా రాణించడం చాలా గొప్ప విషయమని రమణారావు అన్నారు. క్రీడల్లో రాణించిన వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు.