చరిత్ర సృష్టించిన తులసి చైతన్య
ఐర్లాండ్:రాష్ట్ర పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న తులసి చైతన్య చరిత్ర సృష్టించారు. ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్‌లో జరు గుతున్న ప్రపంచ పోలీసు క్రీడల్లో చైతన్య మూడు బంగారు, మూడు రజత పతకాలతో సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. భారతదేశ చరిత్రలో ఓ అంతర్జాతీయ వేదికపై జరిగిన క్రీడల్లో ఒక క్రీడాకారుడు ఇన్ని పతకాలు సాధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రాష్ట్ర క్రీడల విభాగ అద నపు డిజి రాజీవ్ త్రివేదీ శిష్యుడైన చైతన్య ఏడాది క్రితమే ఈత పోటీల్లో వెలుగులోకి వచ్చారు. అప్పటి నుంచి బెంగళూరులో ప్రత్యేక శిక్షణ తీసుకున్న చైతన్య ఇటీవల జరిగిన జాతీయ పోలీసు క్రీడోత్సవాలలో పతకాలు సాధించి సత్తాచాటారు.
దీంతో ప్రపంచ పోలీసు క్రీడలకు అతను ఎంపికయ్యారు. పలు విభాగాల్లో పోటీ పడ్డ చైతన్య మొదట 4×50 మీటర్ల బటర్ ఫ్లై పోటీల్లో బంగారు పతకాన్ని సాధించగా అనంతరం 4×50 మీటర్ల మిడ్లే రిలేలోనూ సత్తా చాటి మరో బంగారు పతాకాన్ని కైవసం చేసుకున్నారు. దీని తరువాత వంద మీటర్ల ఫ్రీ స్టైల్‌లోనూ స్వర్ణ పతకం అందుకున్నారు. దీని తరువాత 50 మీ టర్ల ఫ్రీ స్టైల్, వంద మీటర్ల బ్యాక్ స్ట్రోక్, 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ పోటీల్లో మూడు రజత పతకాలు సాధించి రికార్డు సాధించారు. అమెరికా, కెనడా, ఆ స్ట్రేలియాతో పాటు పలు యూరప్ దేశాల క్రీడాకారులు పాల్గొన్న ఈ ఈత పోటీల్లో తొలి ప్రయత్నంలోనే చైతన్య ఆరు పతకాలు సాధించడంపట్ల రాష్ట్ర డిజిపి దినేష్ రెడ్డి, క్రీడల విభాగ అదనపు డిజి రాజీవ్ త్రివేదీ సంతోషం వ్యక్తం చేశారు.