దూసుకెళ్తున్న తులసీరామ్ | Tulsi ram in lead position | Sakshi
Sakshi News home page

దూసుకెళ్తున్న తులసీరామ్

Published Fri, May 9 2014 12:24 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Tulsi ram in lead position

సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఫిడే రేటింగ్ చెస్ టోర్నీలో హైదరాబాద్ ఆటగాడు ఎం.తులసీ రామ్‌కుమార్ తిరుగులేని ఆధిక్యంతో దూసుకెళ్తున్నాడు. హబ్సిగూడలోని సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్‌లో జరుగుతున్న నాలుగు రోజుల ఈ టోర్నీలో భాగంగా గురువారం సి.వి.విక్రమ్ తేజతో జరిగిన ఏడో రౌండ్‌లో తులసీరామ్ విజయం సాధించాడు. దీంతో మూడో రోజు ఏడో రౌండ్ ముగిసేసరికి తులసీరామ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.  
 
 ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు పొట్లూరి సుప్రీత 5వ స్థానంలో, ఎం.తేజ సురేష్ 6వ స్థానంలో కొనసాగుతుండగా, విశ్వనాథ్ వివేక్, సి.వి.విక్రమ్ తేజ, ఎస్.ఎస్.వి.ఆదిత్య, ఎం.సత్యనారాయణ, ఎస్.సుబ్బరాజులు వరుసగా 8 నుంచి 12వ స్థానాల్లో ఉన్నారు. మూడో రోజు పోటీల్లో బ్రహ్మేచ దివేశ్-సత్యగిరి, ఎస్.ఎస్.వి.ఆదిత్య-సత్యనారాయణ, సంకలన్ భారతి-అమిత్ పంచల్‌ల మధ్య మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. వెంకటరమణపై సాహు దాశరథి, ఆర్.మురళీధరన్‌పై పద్మానంద్ మీనన్, వి.భాస్కర్‌పై పొట్లూరి సుప్రీత, కంది రవిపై ఎస్.సుబ్బరాజు గెలుపొందారు. ఇతర మ్యాచ్‌ల్లో విశ్వనాథ్ వివేక్ చేతిలో కడవ్ ఓంకార్, తేజసురేష్ చేతిలో శివపవన్‌లు ఓడిపోయారు.
 
 ఆకట్టుకుంటున్న సుప్రీత
 అయితే 13 ఏళ్ల చిన్నారి పొట్లూరి సుప్రీత తన ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. టోర్నీలో 19వ సీడ్‌గా బరిలోకి దిగిన సుప్రీత టాప్-8 లో కొనసాగుతూ ప్రశంసలు పొందుతోంది. 1800 లోపు రేటింగ్ పాయింట్లు కలిగిన క్రీడాకారుల మధ్య జరుగుతున్న రూ. 2.50 లక్షల ప్రైజ్‌మనీ గల ఈ టోర్నీలో చివరి రెండు రౌండ్లు శుక్రవారం జరగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement