ఆ ‘ఇద్దరే’ ఫేవరెట్స్‌... | U.S. Open hopes rest on possibility of first Roger Federer-Rafael Nadal match at tournament | Sakshi
Sakshi News home page

ఆ ‘ఇద్దరే’ ఫేవరెట్స్‌...

Published Mon, Aug 28 2017 1:36 AM | Last Updated on Sun, Sep 17 2017 6:01 PM

ఆ ‘ఇద్దరే’ ఫేవరెట్స్‌...

ఆ ‘ఇద్దరే’ ఫేవరెట్స్‌...

అందరి కళ్లు నాదల్, ఫెడరర్‌పైనే  
బరిలో షరపోవా
నేటి నుంచి యూఎస్‌ ఓపెన్‌  


ఈ సీజన్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌కు రంగం సిద్ధమైంది. సీడెడ్‌ ఆటగాళ్లు, మాజీ చాంపియన్లు గాయాలతో  దూరమవడంతో కళ తప్పిన ఈ టోర్నీకి చిరకాల ప్రత్యర్థులు నాదల్, ఫెడరర్‌లే ఫేవరెట్లుగా నిలిచారు. రష్యా బ్యూటీ మరియా షరపోవా వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీతో బరిలోకి దిగుతోంది.  

న్యూయార్క్‌: 13 ఏళ్లు... 37 మ్యాచ్‌లు... చిరకాల ప్రత్యర్థులు నాదల్, ఫెడరర్‌ల వైరానికి ఎన్నో వేదికలు. అయినా వీరిద్దరి పోరంటే ఆసక్తి తగ్గదు. హోరాహోరీ తప్పదు. టెన్నిస్‌కే వన్నె తెచ్చిన ఈ లెజెండ్స్‌ యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌పై కన్నేశారు. ఇప్పటికే ఈ సీజన్‌లో జరిగిన మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు వీరి చేతికే చిక్కాయి. ఈ నేపథ్యంలో స్పెయిన్‌ స్టార్, నంబర్‌వన్‌ రాఫెల్‌ నాదల్, మూడో సీడ్‌ స్విట్జర్లాండ్‌ దిగ్గజం ఫెడరర్‌ ఈ చివరి గ్రాండ్‌స్లామ్‌లో టైటిల్‌ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. స్టార్‌ ఆటగాళ్లు గాయాలతో వైదొలగడంతో ఒకే పార్శ్వంలో ఉన్న నాదల్, ఫెడరర్‌ సెమీస్‌లో అమీతుమీ తేల్చుకునే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.  మూడేళ్ల తర్వాత టాప్‌ ర్యాంకుకు చేరిన నాదల్‌ ఇక్కడ 2010, 2013లో టైటిల్స్‌ నెగ్గాడు.

మరోవైపు ఫెడరర్‌ ఏకంగా ఐదుసార్లు (2004 నుంచి 2008) యూఎస్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. 36 ఏళ్ల ఈ వన్నె తగ్గని వెటరన్‌ ఈ సీజన్‌లో ఆస్ట్రేలియా, వింబుల్డన్‌ టైటిళ్లు సాధించాడు. పురుషుల సింగిల్స్‌ తొలిరౌండ్లో నాదల్‌... లెజొవిచ్‌ (సెర్బియా)తో, ఫెడరర్‌... టియాఫె (అమెరికా)తో తలపడతారు. మహిళల సింగిల్స్‌లో షరపోవా... రెండో సీడ్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా)తో, టాప్‌ సీడ్‌ ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)... లినెట్‌ (పొలాండ్‌)తో, 9వ సీడ్‌ వీనస్‌ విలియమ్స్‌... విక్టోరియా కుజ్‌మోవా (స్లోవేకియా)తో, మూడో సీడ్‌ ముగురుజా... లెప్చెంకో (అమెరికా)తో, 13వ సీడ్‌ క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌)... జెలెనా జంకోవిచ్‌ (సెర్బియా)తో పోటీపడనున్నారు.

గ్రాండ్‌స్లామ్‌లో మళ్లీ షరపోవా...
రష్యా టెన్నిస్‌ అందం మరియా షరపోవా. కోర్టుల్లో షాట్లతో పాటు అరుపులతో హోరెత్తించే ఆమె... డోపింగ్‌ సస్పెన్షన్‌ తర్వాత ఓ మేజర్‌ ఈవెంట్‌ బరిలోకి దిగుతోంది. ఐదు గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన ఆమె నిషేధిత ఉత్ప్రేరకం తీసుకోవడంతో 15 నెలల సస్పెన్షన్‌ విధించారు. ఈ సస్పెన్షన్‌ కాలం ఎప్పుడో ముగిసినా... చిన్నా చితక టోర్నీలే ఆడింది తప్ప మేజర్‌ టోర్నీ ఆడలేదు. తాజాగా 30 ఏళ్ల మరియాకు యూఎస్‌ ఓపెన్‌ నిర్వాహకులు వైల్డ్‌కార్ట్‌ ఎంట్రీ ఇచ్చారు.

దీంతో సస్పెన్షన్‌ అనంతరం తొలిసారిగా గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఆడేందుకు సిద్ధమైంది. అయితే ఆమె పునరాగమనంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సహచరులు ఆమె ఓ టెన్నిస్‌ ఫైటర్‌ అని స్వాగతిస్తుంటే... మరి కొందరు విమర్శలు ఆపడం లేదు. ‘టెన్నిస్‌ అభిమాని ఆమె మ్యాచ్‌వైపు కన్నెత్తి చూస్తాడని నేననుకోవడం లేదు’ అని 15వ సీడ్‌ మాడిసన్‌ కీస్‌ అభిప్రాయపడింది. ‘షరపోవా మంచి ఫైటర్‌. కోర్టుల్లో స్ఫూర్తి కనబరుస్తుంది. అభిమానులు ఆమెను ఆదరిస్తారు. టోర్నీకి వన్నె తెస్తుంది’ అని మూడో సీడ్‌ ముగురుజా (స్పెయిన్‌) పేర్కొంది. ‘ప్రొఫెషనల్‌ ప్లేయర్‌ షరపోవా శుభారంభం చేస్తుంది’ అని ప్రపంచ నంబర్‌వన్‌ ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) తెలిపింది.

గాయంతో ముర్రే కూడా...
స్టార్‌ ఆటగాళ్ల గాయాలతో యూఎస్‌ ఓపెన్‌ కోర్టులు కళతప్పనున్నాయి. ఇప్పటికే మాజీ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా), డిఫెండింగ్‌ చాంపియన్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌), మాజీ రన్నరప్‌ నిషికోరి (జపాన్‌), రావ్‌నిచ్‌ (కెనడా)లు ఈ టోర్నీకి దూరం కాగా... తాజాగా బ్రిటన్‌ స్టార్, ప్రపంచ రెండో ర్యాంకర్‌ ఆండీ ముర్రే ఈ జాబితాలో చేరాడు. తుంటి గాయంతో అతను ఈ సీజన్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ ఈవెంట్‌ నుంచి వైదొలిగాడు. దీంతో టాప్‌–11 ర్యాంకర్లలో ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు ఈ టోర్నీకి దూరమయ్యారు.

రాత్రి గం. 8.15 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌ సెలెక్ట్‌–1లో ప్రత్యక్ష ప్రసారం  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement