అంపైర్‌ తప్పిదం.. సెంచరీ మిస్ | Umpiring Mistake Robs D’Arcy Short of Century | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 14 2019 5:52 PM | Last Updated on Mon, Jan 14 2019 5:54 PM

Umpiring Mistake Robs D’Arcy Short of Century - Sakshi

మెల్‌బోర్న్‌ : టెక్నాలజీ యుగంలో కూడా ఫీల్డ్‌ అంపైర్లు పప్పులో కాలేస్తున్నారు. ఈ మధ్య ఈ తరహా ఘటనలు మరి ఎక్కువయ్యాయి. మొన్న భారత్‌-ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్‌లో అంపైర్‌ తప్పిదం మ్యాచ్‌ ఫలితంపై ప్రభావం చూపగా.. తాజాగా మరో అంపైర్‌ అలసత్వం బ్యాట్స్‌మెన్‌ శతకాన్ని పూర్తిచేసుకోకుండా చేసింది. ఆస్ట్రేలియా బిగ్‌బాష్‌లీగ్‌లో హోబర్ట్‌ హరికేన్స్‌, మెల్‌బోర్న్‌ స్టార్స్‌ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ డీఆర్సీ షార్ట్‌ అంపైర్‌ తప్పిదాని బలయ్యాడు. తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. హోబర్ట్‌ హరికేన్స్‌ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన డీఆర్సీ షార్ట్‌ 57 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 96 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో విండీస్‌ స్టార్‌ బౌలర్‌ డ్వాన్‌ బ్రావో యార్కర్‌ సంధించగా.. డీఆర్సీ అద్భుతంగా ఫైన్‌ లెగ్‌ దిశగా బౌండరీ సాధించాడు. కానీ అంపైర్‌ మాత్రం ఆ ఫోర్‌ను లెగ్‌ బైస్‌గా ప్రకటించాడు.

ఈ నిర్ణయంతో డీఆర్సీ అవాక్కయ్యాడు. వెంటనే అంపైర్‌ నిర్ణయంపై అసహనం కూడా వ్యక్తం చేశాడు. ఆసమయంలో డీఆర్సీ వ్యక్తిగత స్కోర్‌ 86 పరుగులు. ఆ తరువాత అతను స్ట్రైకింగ్‌ చేసినప్పటికి సెంచరీ పూర్తి చేసుకునే అవకాశం దక్కలేదు. ఆ ఫోర్‌పై అంపైర్‌ సరైన నిర్ణయం తీసుకొని ఉంటే డీఆర్సీ సెంచరీ పూర్తి అయ్యేది. ఈ ఓవర్‌కు సంబంధించిన వీడియోను క్రికెట్‌ ఆస్ట్రేలియా అధికార వెబ్‌సైట్‌ క్రికెట్‌.​కామ్‌. ఏయూ అధికార ట్విటర్‌లో షేర్‌ చేసింది. దీంతో అభిమానులు ఆ అంపైర్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సందేహంగా ఉంటే థర్డ్‌ అంపైర్‌ సమీక్ష కోరవచ్చుగా.. అసలేం అయింది ఈ అంపైర్లకు అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో హరికేన్స్‌ 59 పరుగలుతో ఘనవిజయం సాధంచింది. (చదవండి : అంపైర్‌ తప్పిదమే కోహ్లిసేన కొంపముంచిందా? )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement