జూనియర్లు సాధించారు | under -19 world cup win by south africa | Sakshi
Sakshi News home page

జూనియర్లు సాధించారు

Published Sun, Mar 2 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 4:14 AM

జూనియర్లు సాధించారు

జూనియర్లు సాధించారు

 దుబాయ్: నైపుణ్యం కలిగిన జట్టైనా దక్షిణాఫ్రికా జట్టు ఇప్పటిదాకా ప్రపంచకప్‌ను గెలుచుకుంది లేదు. ఎంత బాగా ఆడినా దురదృష్టం వెంటాడి వారిని టోర్నీ నుంచి పక్కకు తప్పుకునేలా చేసింది.

 

అయితే సీనియర్లకు దక్కని ఆ ట్రోఫీని ఇప్పుడు జూనియర్ ఆటగాళ్లు సాధించి చూపారు. ఓపెనర్ ఎయిడెన్ మర్‌క్రామ్ (125 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు) అజేయ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోవడంతో సఫారీ ఆటగాళ్లు తొలిసారిగా అండర్-19 ప్రపంచకప్‌ను గెలుచుకున్నారు. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై గెలిచింది.

 

దీంతో ఈ టోర్నీని ఒక్క ఓటమి కూడా లేకుండా ముగించినట్టయ్యింది.  టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పాక్ 44.3 ఓవర్లలో 131 పరుగుల స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. చివరి వరుస బ్యాట్స్‌మన్ అమద్ బట్ (54 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పేసర్ బోష్ (4/15) రెచ్చిపోవడంతో 26 పరుగుల వ్యవధిలోనే పాక్ ఐదు వికెట్లను కోల్పోయింది. చివర్లో బట్ పోరాడడంతో ఈ మాజీ చాంపియన్ ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. డిల్, వల్లీ రెండేసి వికెట్లు తీశారు.
 

 

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 42.1 ఓవర్లలో నాలుగు వికెట్లకు 134 పరుగులు చేసి నెగ్గింది. 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ మర్‌క్రామ్ అద్భుత ఇన్నింగ్స్‌ను ప్రదర్శించాడు. మరోవైపు గ్రెగ్ ఓల్డ్‌ఫీల్డ్ (68 బంతుల్లో 40; 2 ఫోర్లు) చక్కటి సహకారం అందించడంతో స్కోరు పరుగులు తీసింది. పాక్ బౌలర్లను ఈ జోడి సమర్థవంతంగా ఎదుర్కొంది. అటు చరిత్ర సృష్టించే మ్యాచ్ కావడంతో మర్‌క్రామ్ నిర్లక్ష్యపు షాట్లకు వెళ్లకుండా ఆడాడు. ఓల్డ్‌ఫీల్డ్‌తో కలిసి మూడో వికెట్‌కు 71 పరుగులు జోడించాడు. ఈ దశలో వరుస ఓవర్లలో రెండు వికెట్లు పడ్డా లక్ష్యం తక్కువగానే ఉండడంతో ఇబ్బంది ఎదురుకాలే దు. 98 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న మర్‌క్రామ్‌కు చివర్లో బ్రాడ్లీ డయల్ (24 బంతుల్లో 14 నాటౌట్; 2 ఫోర్లు) అండగా నిలిచాడు. కరామత్ అలీకి రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా బోష్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా మర్‌క్రామ్ నిలిచారు.
 

 

ఇదే తొలిసారి..

ఓవరాల్‌గా కుర్రాళ్లు సాధించిన ఈ విజయం దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. సీనియర్లు గతంలో చాంపియన్స్ ట్రోఫీ మాత్రమే గెలుచుకోగలిగారు. ఇప్పటి దాకా వారు వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది లేదు. కానీ జూనియర్ ఆటగాళ్లు మాత్రం పట్టుదలతో ఆడి ఈ టోర్నీలో అపజయమనేది లేకుండా చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement