
శభాష్ సానియా
యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ వశం
రూ.90 లక్షల 40 వేల ప్రైజ్‌మనీ సొంతం
న్యూయార్క్: టాప్ సీడ్ హోదాకు తగ్గట్టు రాణించిన సానియా మీర్జా తన భాగస్వామి బ్రూనో సోరెస్ (బ్రెజిల్)తో కలిసి యూఎస్ ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను గెల్చుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సానియా-సోరెస్ ద్వయం 6-1, 2-6, 11-9తో అబిగెయిల్ స్పియర్స్ (అమెరికా)-శాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో) జంటపై విజయం సాధించింది.
విజేతగా నిలిచిన సానియా జోడికి లక్షా 50 వేల డాలర్లు (రూ. 90 లక్షల 40 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సానియా కెరీర్‌లో ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. గతంలో ఈ హైదరాబాద్ అమ్మాయి మహేశ్ భూపతి (భారత్) తో కలిసి 2009 ఆస్ట్రేలియన్ ఓపెన్, 2012 ఫ్రెంచ్ ఓపెన్‌లలో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్స్ కైవసం చేసుకుంది.
అన్‌సీడెడ్ స్పియర్స్-గొంజాలెజ్‌తో 60 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సానియా జంట తొలి సెట్‌ను అలవోకగా నెగ్గినా... రెండో సెట్‌లో తడబడింది. దాంతో ఫలితం ‘సూపర్ టైబ్రేక్’ ద్వారా తేలింది. టైబ్రేక్‌లో సానియా జంట నిలకడగా రాణించి తొలుత 5-2తో... ఆ తర్వాత 9-4తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే స్పియర్స్-గొంజాలెజ్ ద్వయం వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి స్కోరును 9-9 వద్ద సమం చేసింది. అయితే సానియా జోడి సంయమనం కోల్పోకుండా వరుసగా రెండు పాయింట్లు సాధించి 11-9తో ‘సూపర్ టైబ్రేక్’ను దక్కించుకోవడంతోపాటు టైటిల్‌ను సొంతం చేసుకుంది.
మహిళల డబుల్స్‌లో నిరాశ
మరోవైపు గురువారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి 2-6, 4-6తో మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)-ఫ్లావియా పెనెట్టా (ఇటలీ) జంట చేతిలో ఓడిపోయింది. సెమీస్‌లో ఓడిన సానియా జంటకు లక్షా 24 వేల 450 డాలర్లు (రూ. 75 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
సూపర్ ఫెడరర్
ఐదుసార్లు చాంపియన్ రోజర్ ఫెడరర్ ఓటమి అంచుల్లో నుంచి గట్టెక్కి విజయతీరాలకు చేరాడు. తొమ్మిదోసారి యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ ఫెడరర్ 4-6, 3-6, 6-4, 7-5, 6-2తో 20వ సీడ్ గేల్ మోన్‌ఫిస్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. మూడు గంటల 20 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ నాలుగో సెట్‌లో 4-5 స్కోరు వద్ద రెండు మ్యాచ్ పాయింట్లను కాచుకున్నాడు.
మరో క్వార్టర్ ఫైనల్లో 14వ సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 6-2, 6-4, 7-6 (7/4)తో ఆరో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)ను బోల్తా కొట్టించి సెమీస్‌లో ఫెడరర్‌తో పోరుకు సిద్ధమయ్యాడు. ముఖాముఖి రికార్డులో ఫెడరర్ 5-0తో సిలిచ్‌పై ఆధిక్యంలో ఉన్నాడు.