
దేశానికి, తెలంగాణకు అంకితం
యూఎస్ ఓపెన్ టైటిల్‌పై సానియా
న్యూఢిల్లీ: ‘నా విజయాన్ని భారత దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి, మా రాష్ట్ర ప్రజానీకానికి అంకితమిస్తున్నాను’... యూఎస్ ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలిచిన సానియామీర్జా వ్యాఖ్య ఇది. గతంలో తనంతట తాను ఎప్పుడూ విజయాలను ఎవరికో అంకితం చేస్తున్నట్లు ప్రకటించలేదు. కానీ ఈసారి మాత్రం ప్రత్యేకంగా దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రస్తావిస్తూ వ్యాఖ్య చేసింది. దీనికి కారణం... తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితురాలు అయిన తర్వాత వచ్చిన వివాదం.
పాక్ క్రికెటర్‌ను పెళ్లి చేసుకున్న సానియా జాతీయతపై అప్పట్లో చర్చ జరిగింది. దీనికి తన విజయంతోనే సానియా సమాధానం చెప్పినట్లయింది. ‘రెండు వారాలు అద్భుతంగా గడిచాయి. యూఎస్ ఓపెన్ కూడా గెలిచినందుకు సంతోషంగా ఉంది. ఏదో ఒక రోజు కెరీర్ గ్రాండ్‌స్లామ్ సాధిస్తాను’ అని సానియా తెలిపింది. వింబుల్డన్ మినహా సానియా మిగిలిన మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలోనూ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలిచింది. టోర్నీ జరిగే సమయంలో తన మనసులో ఎలాంటి వివాదాల గురించిన ఆలోచనలు ఉండవని చెప్పిన సానియా... తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది.
ప్రణబ్, కేసీఆర్ అభినందనలు
యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్న సానియా మీర్జాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసించారు. ‘ఈ టైటిల్ సాధించడం ద్వారా సానియా... భారత్ గర్వపడేలా చేసింది’ అని ట్వీట్ చేశారు. దీనికి ‘థ్యాంక్యూ సో మచ్ సర్’ అంటూ సానియా రీట్వీట్ చేసింది. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సానియాను కొనియాడారు.
‘తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ గెలుచుకోవడం ద్వారా రాష్ట్ర ఖ్యాతిని పెంచారు. మూడు గ్రాండ్‌స్లామ్స్ గెలుచుకున్నందుకు రాష్ట్ర ప్రజలు గర్విస్తున్నారు. క్రీడాకారులకు మెరుగైన సదుపాయాలు కల్పించి అద్భుత ఫలితాలు రాబట్టడమే మా ప్రభుత్వ విధానం’ అని కేసీఆర్ తన ప్రకటనలో తెలిపారు.