బోల్ట్ కు మంత్రి పదవి?
రియో డీ జనీరో: తన ఒలింపిక్స్ కెరీర్ను దిగ్విజయంగా ముగించిన జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ తన రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటివరకూ పరుగులో అలరించిన బోల్ట్ రాజకీయాల్లోకి అడుగుపెట్టే యోచనలో ఉన్నాడు. ఈ మేరకు జమైకా ప్రధాని ఆండ్రూ హోల్నెస్ నుంచి ఓ సందేశం బోల్ట్ కు చేరింది. ఇప్పటికే తమ కీర్తిని ఎంతో ఉన్నతిలో నిలబెట్టిన బోల్ట్కు రాజకీయ ద్వారాలు తెరిచే ఉన్నాయంటూ ఆయన సంకేతాలు పంపారు. 'బోల్ట్ ప్రదర్శనతో జమైకాకు చాలా లాభం చేకూరింది. ఎన్నో ఘనతలను సాధించిన బోల్ట్ పేరును ఉపయోగించుకోవడం మాకు చాలా ముఖ్యం. అందుకు మా తలుపులు తెరిచే ఉన్నాయి' అని బీబీసీకి ఇచ్చిన ఇంటర్యూలో హాలెన్స్ పేర్కొన్నారు. అతను ఒకవేళ మంత్రి పదవి కోరుకున్నా ఇచ్చేందుకు సిద్ధమంటూ ఆయన స్పష్టం చేశారు.
ఆదివారం 30వ బర్త్ డే చేసుకుంటున్న బోల్ట్..తన రెండో ఇన్నింగ్స్పై త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. జమైకా ప్రజల కోరిక మేరకు బోల్ట్ రాజకీయ ప్రవేశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ బోల్ట్ రాజకీయ ప్రవేశం జరిగితే ఆ ఘనత సాధించిన తొలి ఒలింపియన్ గా బోల్ట్ నిలిచిపోతాడు.