వరుణ్ డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: సీబీఎస్‌ఈ క్లస్టర్-7 టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్ (బీవీబీపీఎస్, జూబ్లీహిల్స్) విద్యార్థి వరుణ్ శంకర్ సత్తాచాటాడు. మైసమ్మగూడలోని డీఆర్‌ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో అతను రెండు పసిడి పతకాలు సాధించాడు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల స్కూలు జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. వ్యక్తిగత విభాగంలో టైటిల్ గెలిచిన వరుణ్... ఇదే జోరుతో టీమ్ ఈవెంట్‌లో తన స్కూల్ జట్టును గెలిపించి మరో స్వర్ణం గెలుచుకున్నాడు. దీంతో బీవీబీపీఎస్ జట్టు జాతీయ సీబీఎస్‌ఈ చాంపియన్‌షిప్‌కు అర్హత సంపాదించింది.
ఈ టోర్నీ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో డిసెంబర్ 8 నుంచి 12 వరకు జరగనుంది. సోమవారం జరిగిన బాలుర వ్యక్తిగత విభాగం ఫైనల్లో వరుణ్ శంకర్ 11-5, 11-9, 11-4తో కార్తీక్ (మెరిడియన్ స్కూల్)ను వరుస గేముల్లో కంగుతినిపించాడు. సెమీస్‌లో అతను 11-6, 12-10, 11-7తో బక్ష్ తిలన్ (వీవీడీ స్కూల్, కర్ణాటక)పై, క్వార్టర్స్‌లో 11-5, 11-6తో ఆదిత్య (డీపీఎస్, మంగళూరు)పై గెలుపొందాడు. టీమ్ ఈవెంట్ ఫైనల్లో బీవీబీపీఎస్ జట్టు 3-0తో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్, హైదరాబాద్)పై విజయం సాధించింది.
బీవీబీ కెప్టెన్ వరుణ్ 11-5, 11-6, 11-2తో రోహన్ దేశాయ్ (డీపీఎస్)పై, వత్సిన్ 11-8, 11-5, 11-8తో ఆర్యన్ (డీపీఎస్)పై, వృశిన్ 11-9, 11-9, 11-6తో రాఘవ్ రతిపై గెలుపొందారు. సెమీఫైనల్లో బీవీబీపీఎస్ జట్టు 3-0తో చిరెక్ పబ్లిక్ స్కూల్ (హైదరాబాద్)పై, క్వార్టర్స్‌లో బీవీబీపీఎస్ జట్టు 3-0తో డీపీఎస్ (బెంగళూరు) జట్టుపై నెగ్గింది.
బాలికల చాంప్ లాస్య
భవాన్స్ శ్రీరామకృష్ణ విద్యాలయ (హైదరాబాద్) అమ్మాయి వి.లాస్య బాలికల వ్యక్తిగత విభాగంలో విజేతగా నిలిచింది. జ్యోతి కేంద్రీయ విద్యాలయ (బెంగళూరు)కు చెందిన అనర్గ్య రన్నరప్‌తో సరిపెట్టుకోగా, శ్రీఅరబిందో స్కూల్ (బెంగళూరు) క్రీడాకారిణి ఆనందమయి మూడో స్థానంలో నిలిచింది. బాలికల టీమ్ ఈవెంట్‌లో డీపీఎస్ (బెంగళూరు) జట్టు చాంపియన్‌షిప్ సాధించింది. రెండు కర్ణాటక జట్ల మధ్య జరిగిన ఈ ఫైనల్లో డీపీఎస్ 3-1తో కేఎల్‌ఈ ఇంటర్నేషనల్ స్కూల్‌పై విజయం సాధించింది.