విరాట్ కోహ్లి
సిడ్నీ: టీవీ షోలో మహిళల పట్ల భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తప్పుబట్టాడు. వారి వ్యక్తిగత వ్యాఖ్యలతో భారత క్రికెట్ జట్టుకు సంబంధం లేదని వ్యాఖ్యానించాడు. సిడ్నీలో విలేకరులతో మాట్లాడుతూ.. టీమిండియా సభ్యులు నోరు అదుపులో పెట్టుకోవాలని, అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నాడు.
‘పాండ్యా, రాహుల్ చేసిన వ్యాఖ్యలను టీమిండియా ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదు. వారిద్దరూ చాలా తప్పుగా మాట్లాడారు. వీటి పర్యవసానం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాళ్లు బాధ్యతగా మెలగాలి. వారి వ్యక్తిగత వ్యాఖ్యలను జట్టుకు ఆపాదించడం సరికాద’ని కోహ్లి అన్నాడు. పాండ్యా, రాహుల్‌పై బీసీసీఐ ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే దాని గురించి వేచి చూస్తున్నట్టు చెప్పాడు. ఈ వివాదం జట్టుపై, తమ ఆటతీరుపై ఎటువంటి ప్రభావం చూపబోదని విశ్వాసం వ్యక్తం చేశాడు.
‘బీసీసీఐ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం. తాజా పరిణామాలు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణంపై ఎటువంటి ప్రభావం చూపబోవు. ఎన్ని వివాదాలు జరిగినా మా క్రీడా స్ఫూర్తి చెదిరిపోదు. పాండ్యా, రాహుల్ చేసిన వ్యాఖ్యలు వారి వ్యక్తిగతం. ఈ మాటలు సరైనవి కాద’ని విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. కాగా, పాండ్యా, రాహుల్‌లపై బీసీసీఐ 2 మ్యాచ్‌ల నిషేధం విధించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. వీరిపై చర్యలు తీసుకుంటే ఆస్ట్రేలియాలో శనివారం ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌లో ఆడే అవకాశం కోల్పోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment