
'ఇది విరాట్ కోహ్లి శకం'
న్యూఢిల్లీ:భారత క్రికెట్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ దూసుకుపోతున్న టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై మాజీ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్లు ప్రశంసల వర్షం కురిపించారు. భారత క్రికెట్ లో విరాట్ శకం ప్రారంభమైందంటూ సునీల్ గవాస్కర్ కొనియాడాడు. 'గతేడాది భారత క్రికెట్ జట్టు టెస్టు బాధ్యతలు చేపట్టిన విరాట్ అద్భుతమైన ఆట తీరుతో విజయాలు సాధించి పెడుతున్నాడు. విరాట్ ది భిన్నమైన శైలి. ప్రస్తుత టీమిండియా క్రికెట్ శకం అత్యంత వినోదాత్మకంగా సాగుతుంది. విరాట్ పరిమిత ఓవర్ల కెప్టెన్ కాకపోయినప్పటికీ, ఇది కచ్చితంగా విరాట్ కోహ్లి శకమే' అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
అయితే వీరేంద్ర సెహ్వాగ్ మరో అడుగు ముందుకేసి విరాట్ ను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్తో పోల్చాడు. టీమిండియాకు దొరికిన కొత్త టెండూల్కర్ ఎవరైనా ఉంటే కోహ్లియే అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. 'లక్ష్య ఛేదనలో మేటి ఆటగాళ్ల రికార్డులను పరిశీలిస్తే విరాట్ యావరేజ్ అమోఘం. అదే అతన్ని వరల్డ్ నంబర్ వన్ ఆటగాడిగా నిరూపిస్తుంది. విరాట్ కు పరుగుల ఆకలి ఎక్కువ. ఎప్పుడూ భారత జట్టు గెలవాలనే తపనతోనే క్రికెట్ ఆడతాడు' అని సెహ్వాగ్ పొగడ్తల వర్షం కురిపించాడు.