విరాట్ కోహ్లి
బెంగళూరు : అంపైర్లు కళ్లు తెరవాలి అంటూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లి మండిపడ్డాడు. గురువారం సొంత మైదానం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆర్సీబీ విజయానికి చివరి 5 బంతుల్లో 11 పరుగులు కావాల్సి ఉండగా.. తన అనుభవాన్నంతా ఉపయోగిస్తూ మలింగ 4 పరుగులే ఇచ్చి ముంబైని గట్టెక్కించాడు. అయితే ఆఖరి బంతి ‘నోబాల్’ కాగా... అంపైర్లు గుర్తించడంలో పొరపాటు చేశారు. మ్యాచ్ ముగిశాక రీప్లేలో ఇది ఖరారైనా అప్పటికే ఆలస్యమైపోయింది. అంపైర్ల పొరపాటును బిగ్‌స్క్రీన్‌పై చూసిన కోహ్లి.. ప్రజంటేషన్ పోడియం వైపు దూసుకు వచ్చి అంపైర్ల తప్పుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
‘మేం ఐపీఎల్ ఆడుతున్నాం. క్లబ్ స్థాయి క్రికెట్ కాదు. అంపైర్లు కళ్లు తెరుచుకొని ఉండాలి. ఆఖరి బంతిని నోబాల్‌గా ప్రకటించకపోవటం దుర్మార్గం. ఏకంగా అంగుళం తేడాతో అడుగు పడింది. అంపైర్లు ఏమైనా కళ్లు మూసుకున్నారా! ఇలాంటి చిన్న విషయాలే ఫలితంపై ప్రభావం చూపిస్తాయి. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వాళ్లు మరింత జాగ్రత్తగా, చురుగ్గా ఉండాల్సింది.’ అని ఊగిపోయాడు.
ఏది ఏమైనా తమ రెండవ ఓటమని అంగీకరించిన కోహ్లి అనవసర తప్పిదాలతో మ్యాచ్‌ను చేజార్చకున్నామన్నాడు. ‘145/7తో మేం ఓ దశలో పటిష్టంగా ఉన్నాం. కానీ చివరి ఓవర్లు మాకు కష్టంగా మారాయి. ఏబీ అద్భతంగా ఆడాడు. మేం ఇంకా డెత్ ఓవర్లలో మెరుగవ్వాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో మా ఆటగాళ్లు చాలా నేర్చుకున్నారు. ముంబై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. వారి ఆట నుంచి మేం చాలా నేర్చుకున్నాం. నేను కూడా రాంగ్ టైమ్‌లో ఔటయ్యాను. శివం అద్భుతంగా ఆడాడు. జెస్సీ(బుమ్రా) టాప్ క్లాస్ బౌలర్. నేను అతని బౌలింగ్ ఎదుర్కునే విధానంలో తప్పు చేశాను. ముంబై జట్టులో బుమ్రా, మలింగాలు ఉండటం ఆ జట్టు అదృష్టం. జెస్సీ ఫామ్‌లో ఉంటే అది భారత్ జట్టుకు మంచిదే’ అని పేర్కొన్నాడు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 187 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (33 బంతుల్లో 48; 8 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. సూర్యకుమార్ యాదవ్ (24 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా... యువరాజ్ సింగ్ (12 బంతుల్లో 23; 3 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (14 బంతుల్లో 32 నాటౌట్, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగిపోయారు. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులే చేయగలిగింది. ఏబీ డివిలియర్స్ (41 బంతుల్లో 70 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) పోరాటం జట్టును గెలిపించలేకపోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (32 బంతుల్లో 46; 6 ఫోర్లు) ఆకట్టుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment