ఐపీఎల్-9 హైలెట్స్
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు సంచలన విజయాలతో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఇరు జట్ల మధ్య జరిగిన తుదిపోరులో రాయల్ చాలెంజర్స్ను ఓడించి టైటిల్ను దక్కించుకున్న జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే ప్రధానంగా ఈ రెండు జట్లలోని ఆటగాళ్లే పలు రికార్డులను తమ ఖాతాలో వేసుకోవడం ఇక్కడ విశేషం. ఇరు జట్లు ఫైనల్కు చేరే క్రమంలో అనేక అద్భుతాలను నమోదు చేశాయి.
ఈ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లి 973 పరుగులు నమోదు చేసి 'టాప్' స్థానాన్ని దక్కించుకోగా, 38 సిక్సర్లతో తొలి స్థానంలో నిలిచాడు. ఇదే క్రమంలో నాలుగు శతకాలు సాధించి ఒక ఐపీఎల్లో అత్యధిక శతకాలు కొట్టిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. దీంతో పాటు మరో ఏడు హాఫ్ సెంచరీలు విరాట్ సాధించాడు. మరోవైపు హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 23 వికెట్లతో అత్యధిక వికెట్లను సాధించిన ఆటగాడిగా నిలిచాడు. భువీ 21.30 సగటుతో ఈ ఫీట్ను సాధించాడు.
వీటితో పాటు మరికొన్ని హైలెట్స్ ను చూద్దాం.
1.ఈ సీజన్లో 60 మ్యాచ్ల్లో 17, 963 పరుగులు నమోదయ్యాయి
2. ఐపీఎల్-9లో 652 వికెట్లు బౌలర్లు సాధించారు
3. ఈ టోర్నమెంట్లో కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్ జాసన్ హోల్డర్ 150.31 కి.మీ వేగంతో అత్యంత వేగవంతమైన బంతిని సంధించాడు
4. ఈ సీజన్లో 57 డకౌట్లు నమోదయ్యాయి. ఇందులో కోల్ కతా ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ ఐదు సార్లు తన పరుగులు ఖాతాను ఆరంభించకుండానే వెనుదిరిగాడు. దీంతో అత్యధిక సార్లు డకౌట్గా అవుటైన ఆటగాడిగా చెత్త రికార్డును మూట గట్టుకున్నాడు
5. ముంబై ఆటగాడు కీరోన్ పొలార్డ్, ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు క్రిస్ మోరిస్లు 17 బంత్లులో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు సాధించారు.
6.ఈ సీజన్ లో హైదరాబాద్ బౌలర్ ముస్తాఫిజర్ రెహ్మాన్ అత్యుత్తమ ఎకానమీ రేటును సాధించాడు. ఈ సీజన్ మొత్తంగా 50 ఓవర్లకు పైగా బౌలింగ్ వేసిన బౌలర్లలో ముస్తాఫిజుర్ 6.90 బెస్ట్ ఎకానమీతో ఈ సీజన్ ముగించాడు.
7. ఈ సీజన్లో అత్యుత్తమ మ్యాచ్ ఫినిషర్గా పుణె సూపర్ జెయింట్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నిలిచాడు. కింగ్స్ పంజాబ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ధోని చివరి ఓవర్ లో 22 పరుగులు సాధించాడు. ఇందులో ఒక ఫోర్, మూడు సిక్సర్లు ఉన్నాయి. పుణె విజయానికి 23 పరుగులు అవసరమైన సందర్భంలో కింగ్స్ పంజాబ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ బౌలింగ్ లో ధోని అత్యుత్తమ మ్యాచ్ ఫినిషింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.
8. డేవిడ్ వార్నర్ 88 బౌండరీలతో అత్యధిక ఫోర్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.