బెంగళూరుకు భారీ విజయలక్ష్యం
బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఆదివారం ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 209 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ కు శుభారంభం లభించింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(69;38 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు), శిఖర్ ధవన్(28;25 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్)తో దూకుడుగా ఆడారు. ఈ ఇద్దరూ చెలరేగి ఆడటంతో హైదరాబాద్ పవర్ ప్లేలో(తొలి ఆరు ఓవర్లు) వికెట్ నష్టపోకుండా 59 పరుగులు నమోదు చేసింది.అ యితే ఇన్నింగ్స్ ఏడో ఓవర్ నాల్గో బంతికి ధవన్ అవుట్ కావడంతో 63 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
అనంతరం ఫస్ట్ డౌన్లో వచ్చిన హెన్రీక్యూస్(4) నిరాశపరిచినా, వార్నర్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆపై యువరాజ్ సింగ్-వార్నర్ల జోడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఒకవైపు వార్నర్ కాస్త నెమ్మదిస్తే, యువరాజ్(38;23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించాడు. అయితే జట్టు స్కోరు 125 పరుగుల వద్ద వార్నర్ మూడో వికెట్ గా నిష్ర్కమించాడు. అటు తరువా త దీపక్ హుడా, యువరాజ్ లు పరుగు వ్యవధిలో పెవిలియన్ చేరడంతో సన్ రైజర్స్ స్కోరులో వేగం తగ్గింది. ఇక చివర్లో కట్టింగ్(39 నాటౌట్;15 బంతుల్లో 3ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో జోర్డాన్ మూడు వికెట్లు సాధించగా, ఎస్ అరవింద్ కు రెండు , చాహాల్కు వికెట్ దక్కింది.