ఐపీఎల్ విజేత హైదరాబాద్
బెంగళూరు: ఐపీఎల్-9 విజేతగా సన్ రైజర్స్ హైదరాబాద్ అవతరించింది. ఆదివారం జరిగిన తుదిపోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై గెలిచి కొత్త చాంపియన్గా నిలిచింది. అటు బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ ఆకట్టుకున్న సన్ రైజర్స్ ఐపీఎల్ ట్రోఫీని తొలిసారి ముద్దాడింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(69;38 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు), శిఖర్ ధవన్(28;25 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్)తో దూకుడుగా ఆడి జట్టుకు శుభారంభం అందించారు. ఈ ఇద్దరూ చెలరేగి ఆడటంతో హైదరాబాద్ పవర్ ప్లేలో(తొలి ఆరు ఓవర్లు) వికెట్ నష్టపోకుండా 59 పరుగులు నమోదు చేసింది.అ యితే ఇన్నింగ్స్ ఏడో ఓవర్ నాల్గో బంతికి ధవన్ అవుట్ కావడంతో 63 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
అనంతరం ఫస్ట్ డౌన్లో వచ్చిన హెన్రీక్యూస్(4) నిరాశపరిచినా, వార్నర్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆపై యువరాజ్ సింగ్-వార్నర్ల జోడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఒకవైపు వార్నర్ కాస్త నెమ్మదిస్తే, యువరాజ్(38;23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించాడు. అయితే జట్టు స్కోరు 125 పరుగుల వద్ద వార్నర్ మూడో వికెట్ గా నిష్ర్కమించాడు. అటు తరువా దీపక్ హుడా, యువరాజ్ లు పరుగు వ్యవధిలో పెవిలియన్ చేరడంతో సన్ రైజర్స్ స్కోరులో వేగం తగ్గింది. ఇక చివర్లో కట్టింగ్(39;15 బంతుల్లో 3ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో సన్ రైజర్స్ భారీ స్కోరు చేసింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 200 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. బెంగళూరు ఓపెనర్ క్రిస్ గేల్(76; 38 బంతుల్లో 4ఫోర్లు, 8 సిక్సర్లు), విరాట్ కోహ్లి(54;35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చక్కటి ఆరంభాన్నిచ్చినా, ఆ తరువాత మిగతా ఆటగాళ్లు విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. ఒక దశలో హైదరాబాద్ సన్ రైజర్స్ విజయంపై ఆశలు వదిలేసుకుంది. క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ జోడి పరుగుల వరద పారించారు. ఈ జోడీ 114 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన అనంతరం క్రిస్ గేల్ అవుటయ్యాడు. వీరిద్దరు ఔట్ అయిన తర్వాత హైదరాబాద్ సన్ రైజర్స్ బౌలర్సు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడం వలన బ్యాట్స్ మెన్ పరుగులు చేయడానికి తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏబీ డివిలియర్స్ తక్కువ పరుగులకే ఔట్ అయి క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశారు. విరాట్ సేనకు ఫైనల్ లో మరోసారి నిరాశ ఎదురైంది.