
బీసీసీఐ కొత్తగా ఆలోచిస్తోంది
విరాట్ ఎంపికపై డీన్‌జోన్స్ వ్యాఖ్య
సిడ్నీ: భారతదేశంలో కొత్త శతాబ్దంలో వచ్చిన సాంకేతికపరమైన మార్పులతో పాటు ఈతరం యువత కూడా కొత్తగా ఆలోచిస్తోందని... అలాంటి యువతకు ప్రతినిధిగా విరాట్ కోహ్లి కనిపిస్తాడని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డీన్ జోన్స్ వ్యాఖ్యానించారు. బీసీసీఐ ఇంకా సాంప్రదాయ శైలిలోనే సాగితే మురళీ విజయ్‌నో, రహానేనో కెప్టెన్‌గా చేసేదని, కానీ కొత్త ఆలోచనలతో కోహ్లికి నాయకత్వ బాధ్యత అప్పజెప్పిందని ఆయన అన్నారు.
‘ప్రస్తుత భారత యువత తాము ఏం కోరుకుంటే అది సాధించాలనే పట్టుదలతో ఉంది. అందుకు కొంత దూకుడును కూడా జోడిస్తారు. ఇలాంటి ఈతరానికి కోహ్లి సరైన ఉదాహరణ. అతను తొలి బంతి నుంచే గెలవాలని ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో అవసరమైతే ఓటమికి కూడా సిద్ధంగా ఉంటాడు. అతని కెప్టెన్సీ కూడా దూకుడుగా ఉండబోతోంది’ అని జోన్స్ విశ్లేషించారు.
కోహ్లి శైలి అతనికి అసంఖ్యాక అభిమానులను తెచ్చి పెడుతుందని, ముఖ్యంగా మెల్‌బోర్న్ టెస్టు సందర్భంగా ఎవరికి గౌరవం ఇవ్వాలంటూ ఆసీస్ ఆటగాళ్ల గురించి అతను చేసిన వ్యాఖ్య తనను కట్టి పడేసిందని ఈ మాజీ ఆస్ట్రేలియన్ చెప్పారు.