విజ్డెన్ ‘లీడింగ్ క్రికెటర్’గా కోహ్లి
న్యూఢిల్లీ: భారత సంచలన క్రికెటర్ విరాట్ కోహ్లి విఖ్యాత క్రికెట్ మ్యాగజైన్ ‘విజ్డెన్’ లీడింగ్ క్రికెటర్ అవార్డుకు ఎంపికయ్యాడు. గత క్యాలెండర్ ఇయర్ (2016)లో ఓ ఆటగాడి ప్రదర్శన ఆధారంగా ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్‌కు ఈ పురస్కారమి స్తారు. గతేడాది కోహ్లి టెస్టుల్లో 75.93 సగటుతో 1,215 పరుగులు, పది వన్డేల్లో 92.37 సగటుతో 739 పరుగులు, టి20ల్లో 106.83 సగటుతో 641 పరుగులు చేశాడు. ఇప్పటివరకు కేవలం ఆరుగురు బ్యాట్స్‌మెన్ ఒక క్యాలెండర్ ఇయర్‌లో కోహ్లి కంటే ఎక్కువ పరుగులు చేసినప్పటికీ అతని సగటును ఏ ఒక్కరూ చేరుకోలేదని ‘విజ్డెన్’ మ్యాగజైన్ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది విజ్డెన్ మ్యాగజైన్ విరాట్ కోహ్లి కవర్‌పేజీతో విడుదలైంది.
2003లో విజ్డెన్ లీడింగ్ క్రికెటర్‌ను ఎంపిక చేయడం మొదలుపెట్టగా రికీ పాంటింగ్ (ఆసీస్)కు తొలి పురస్కారం దక్కిం ది. భారత్ నుంచి ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడు కోహ్లి. సెహ్వాగ్ (2008, 2009), సచిన్ (2010) అతనికంటే ముందు ఈ జాబితాలో ఉన్నా రు. విజ్డెన్ ఎడిటర్ లారెన్స్ మాట్లాడుతూ ‘సచిన్‌కు సరైన వారసుడు విరాట్ కోహ్లి’ అని కితాబిచ్చారు. ఇటీవల బీసీసీఐ వార్షిక అవార్డుల్లో 28 ఏళ్ల ఈ భారత కెప్టెన్‌కు ‘పాలీ ఉమ్రిగర్ అవార్డు’ దక్కిన సంగతి తెలిసిందే. మరోవైపు ‘క్రికెటర్స్ ఆఫ్ ద ఇయర్’గా మిస్బా ఉల్ హక్, యూనిస్ ఖాన్ (పాకిస్తాన్), బెన్ డకెట్, టాబీ రొలాండ్ జోన్స్, క్రిస్ వోక్స్ (ఇంగ్లండ్) ఎంపికయ్యారు. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఎలిస్ పెర్రీ ‘లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు దక్కించుకుంది.