'విరాట్కు బౌలింగ్ చేయడాన్ని ఇష్టపడను'
ముంబై: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి బౌలింగ్ చేయడానికి తాను ఇష్టపడనని ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ బౌలర్ జెఫ్ లాసన్ స్పష్టం చేశాడు. విరాట్లో సామర్థ్యం, టెక్నిక్ అమోఘమని కొనియాడిన లాసన్.. ఐపీఎల్లో అతనికి బౌలింగ్ చేయాలనే ఆసక్తి తనకు ఎంతమాత్రం లేదని తెలిపాడు. ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న జెఫ్ లాసన్ విరాట్ను ప్రశంసల్లో ముంచెత్తాడు. నిస్సందేహంగా ప్రపంచ అత్యుత్తమ ఆటగాడు విరాటేనని కొనియాడాడు.
'ప్రపంచ అత్యుత్తమ ఆటగాడు విరాట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. 2011-12లో ఆస్ట్రేలియా టూర్కు భారత జట్టు వచ్చినప్పుడు విరాట్ ఆటను చూశాను. ఆస్ట్రేలియా వంటి బౌన్సీ వికెట్లపై ఆడే సత్తా ఉన్నా అతికొద్ది మంది భారత ఆటగాళ్లలో విరాట్ ఒకడు. కొన్ని సందర్భాల్లో సచిన్ వంటి దిగ్గజ ఆటగాడే బౌన్సీ వికెట్ పై ఆడటానికి ఇబ్బంది పడేవాడు. అటువంటిది ఆ తరహా పిచ్ లను కోహ్లి ఒక సవాల్గా స్వీకరించేవాడు. అయితే విరాట్ ఇంకా ప్రపంచం నలుమూలలా రాణించి సత్తా చాటాల్సి అవసరం ఉంది' అని జెఫ్ లాసన్ తెలిపాడు.