దుబాయ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనతను సాధించాడు. కివీస్ తో మూడో వన్డే అనంతరం టాప్ ప్లేస్ కు చేరిన కోహ్లి.. రేటింగ్ పాయింట్లలో ఒక మైలురాయిని చేరుకున్నాడు. కోహ్లి 889 రేటింగ్ పాయింట్లతో తన కెరీర్ అత్యుత్తమ పాయింట్ల ఘనతను అందుకున్నాడు. అదే సమయంలో ఒక భారత క్రికెటర్ గా కూడా అత్యుత్తమ రేటింగ్ పాయింట్లను కోహ్లి తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు భారత తరపున అత్యధిక రేటింగ్ పాయింట్ల ఘనత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. 1998లో 887 రేటింగ్ పాయింట్లతో భారత తరపున అత్యధిక పాయింట్లను సాధించిన క్రికెటర్ గా సచిన్ గుర్తింపు పొందాడు. కాగా, ఈ ఏడాది ఆరంభంలో సచిన్ రేటింగ్ పాయింట్లను సమం చేసిన కోహ్లి.. తాజాగా దాన్ని అధిగమించాడు.
దీనిలో భాగంగా అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్ పట్టికలో కోహ్లి మళ్లీ టాప్ ప్లేస్ ను ఆక్రమించాడు. న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో రెండు శతకాలు సాధించిన కోహ్లి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇటీవల తన టాప్ ర్యాంకును దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ కు కోల్పోయిన కోహ్లి.. మళ్లీ టాప్ ర్యాంకును స్వల్ప వ్యవధిలోనే తిరిగి సాధించాడు. కివీస్ తో వన్డే సిరీస్ అనంతరం తన కెరీర్ అత్యుత్తమ 889 రేటింగ్ పాయింట్లతో తొలిస్థానానికి చేరాడు. న్యూజిలాండ్ తో సిరీస్ లో కోహ్లి 263 పరుగులతో సత్తాచాటాడు. ముంబైలో జరిగిన తొలి వన్డేలో 121 పరుగులు చేసిన కోహ్లి.. కాన్పూర్ లో జరిగిన మూడో వన్డేలో 113 పరుగులు చేశాడు. ఇక వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్ పట్టికలో బూమ్రా మూడో ర్యాంకు సాధించి కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ ను నమోదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment