విరాట్కు స్థానం ఎందుకు దక్కలేదు?
దుబాయ్:విరాట్ కోహ్లి.. అసాధారణ ప్రతిభతో చెలరేగిపోతూ ప్రపంచ క్రికెట్ను శాసిస్తున్న భారత క్రికెటర్. ఒకే ఏడాది మూడు డబుల్ సెంచరీలు కొట్టి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రికెటర్గా గుర్తింపు సాధించాడు. గత కొంతకాలంగా మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తూ ప్రపంచ క్రికెట్లో సూపర్ మ్యాన్ అనిపించుకుంటున్న క్రికెటర్. ప్రస్తుతం విరాట్ శకం నడుస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే 2016 సంవత్సరానికి గాను గురువారం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విడుదల చేసిన టెస్టు జట్టులో కోహ్లికి స్థానం దక్కలేదు. ఐసీసీ వన్డే జట్టుకు కెప్టెన్ గా ఎంపికైన కోహ్లి.. టెస్టు జట్టులో మాత్రం కనీసం చోటు దక్కించుకోలేకపోయాడు. మరొకవైపు ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ మాత్రం టెస్టుల్లో స్థానం దక్కించుకోగా, కోహ్లికి మాత్రం ఆ జాబితాలో చోటు దక్కలేదు. ఇందుకు కారణం ఇరువురి ప్రదర్శనే కారణం.
అయితే ఇక్కడ గమనించాల్సి విషయమేమిటంటే.. గతేడాది సెప్టెంబర్ 14 నుంచి మొదలుకొని 2016 సెప్టెంబర్ 20 వరకూ మాత్రమే ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణలోకి తీసుకున్నారు. ఈ సమయంలో ఎనిమిది టెస్టు మ్యాచ్లు ఆడిన కోహ్లి 45.10 సగటుతో 451 పరుగులు చేశాడు. ఈ 12 నెలల సమయంలో కోహ్లి కేవలం ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ మాత్రమే సాధించాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో కోహ్లి సెంచరీ, హాఫ్ సెంచరీలు మాత్రమే చేసి పెద్దగా ఆకట్టుకోలేదు. అదే సమయంలో రూట్ 14 టెస్టు మ్యాచ్లు ఆడి 55.30 సగటుతో 1272 పరుగులు నమోదు చేశాడు. ఇందులో 9 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలు ఉన్నాయి. దాంతో మాంచెస్టర్లో పాకిస్తాన్ తో జరిగిన టెస్టులో 254 పరుగులు చేసి ఆ ఏడాదిని(ఐసీసీ పరిగణలోకి తీసుకున్న జాబితా ప్రకారం) ఘనంగా ముగించాడు.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే..ఈ ఏడాది సెప్టెంబర్ తరువాత విరాట్ కోహ్లి ఖాతాలో రెండు డబుల్ సెంచరీలు చేరాయి. న్యూజిలాండ్ తో తొలి టెస్టులో డబుల్ సెంచరీ చేసిన విరాట్.. ఇటీవల ఇంగ్లండ్ తో ముగిసిన ఐదు టెస్టుల సిరీస్లో కూడా ద్విశతకం సాధించాడు. ఈ క్రమంలోనే ఆ రెండు టెస్టు సిరీస్ల్లో 80.33 సగటుతో 964 పరుగులు చేశాడు. విరాట్ ఆడిన వరుసగా ఆడిన ఆరుటెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించడం ఇక్కడ విశేషం. ప్రస్తుతం ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్ లో కోహ్లి రెండో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్, ఇంగ్లండ్ సిరీస్ల అనంతరం కోహ్లి ఏకంగా 12 స్థానాలకు పైగా మెరుగుపరుచుకుని రెండో స్థానానికి చేరడం అతని ప్రతిభకు అద్దం పడుతోంది. ఇదే ఫామ్ను విరాట్ కొనసాగిస్తే మాత్రం వచ్చే ఏడాది ఐసీసీ విడుదల చేసి టెస్టు జట్టులో విరాట్ ముందు వరుసలో ఉండటం ఖాయం.