కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడోవన్డేలో సాధించిన అజేయ సెంచరీ చాలా ప్రత్యేకమని, ఇన్నింగ్స్ మొత్తం ఆటను వివిధ రకాలుగా మార్చుకుంటూ శతకం సాధించానని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. బుధవారం ప్రొటీస్‌తో జరిగిన వన్డేలో భారత్ 124 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో ముచ్చటించాడు. కేప్‌టౌన్ వికెట్ చాలా కష్టమైన వికెటని, ప్రత్యర్థి పదునైన బౌలింగ్‌ను ఎదుర్కొని శతకం బాదడం సంతృప్తిగా ఉందని పేర్కొన్నాడు. మ్యాచ్‌లో 30వ ఓవర్ అనంతరం వికెట్ స్లోగా మారిందని, ఆ సమయంలో భారత్ వికెట్లను కోల్పోవడంతో తాను సమయోచితగా ఆడాల్సి వచ్చిందని తెలిపాడు.
ఇన్నింగ్స్ మొత్తం బ్యాటింగ్ చేయడం ఆనందంగా ఉందని, అయితే 90ల్లో ఉన్నప్పుడు కాస్తా నెర్వస్‌గా భావించానని పేర్కొన్నాడు. మరోవైపు తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు లేదా ఛేదనకు దిగినప్పుడు తన వ్యూహాలు వేర్వేరుగా ఉంటాయని చెప్పుకొచ్చాడు. మరోవైపు వరుసగా మూడు వన్డేల్లో నెగ్గి 3–0తో తిరుగులేని ఆధిక్యం సాధించిన తమజట్టు నిర్లిప్తంగా ఉండరాదని కోహ్లి సూచించాడు. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన మూడోటెస్టు నుంచి తాము చాలా కష్టపడి ఆడామని, ఈక్రమంలో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించామని గుర్తు చేశాడు.
జట్టు ప్రదర్శన గర్వకారణంగా ఉందని, అయితే ఇప్పటికి తాము సాధించాల్సింది చాలా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. సిరీస్‌లో మరో మూడుమ్యాచ్‌లు ఉన్నాయని, 6–0తో వైట్‌వాష్‌పై దృష్టిసారించాలని పరోక్షంగా జట్టుకు సూచించాడు. ప్రస్తుతానికి తాము సిరీస్ కోల్పోని దశకు చేరుకున్నామని, ఇది జట్టులో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంపొందిస్తుందని అభిప్రాయపడ్డాడు. నాలుగోవన్డేలో ప్రస్తుతానికి మించిన తీవ్రత, కోరికతో మైదానంలోకి అడుగుపెడతామని కోహ్లి పేర్కొన్నాడు.
తీవ్రతే నా మంత్రం
తీవ్రతే (ఇంటెన్సిటీ) తన బ్యాటింగ్ హాల్‌మార్కు అని, ఒకవేళ అది కోల్పోతే తనకేమీ తోచదని కోహ్లి పేర్కొన్నాడు. ఈ ఏడాది తను 30వ పడిలోకి ప్రవేశిస్తానని, మరో నాలుగైదేళ్లు ఇలాంటి ఇంటెన్సిటీతోనే ఆడతానని తెలిపాడు. ఈక్రమంలో తాను చాలా కఠోర శిక్షణ తీసుకున్నానని తెలిపాడు. తన ఆహారం పట్ల కఠినంగా ఉంటానని పేర్కొన్నాడు. ఇలాంటి విషయాలే తను రాణించాడని దోహదపడుతున్నాయని తెలిపాడు. జట్టుకు అవసరమైన సందర్భాల్లో రాణించడం చాలా ఆనందంగా ఉందని అభిప్రాయపడ్డాడు. బుధవారం వన్డేల్లో చేసిన సెంచరీతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు (12)చేసిన భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు. ఈక్రమంలో సౌరవ్ గంగూలీ (11)ని వెనక్కినెట్టాడు. కేప్‌టౌన్ వన్డే విజయంతో ఆరువన్డేల సిరీస్‌లో 3–0తో ఆధిక్యంలో నిలిచిన భారత్.. శనివారం జోహన్నెస్‌బర్గ్‌లో ప్రొటీస్‌తో నాలుగోవన్డే ఆడనుంది.
చహల్, కుల్దీప్‌లపై ప్రణాళికల్ని సవరించుకోవాలి: డుమిని
భారత స్పిన్నర్లు యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్‌లను ఎదుర్కోవడానికి తమజట్టు తాజాగా మళ్లీ ప్రణాళికల్ని రూపొందించాల్సిన అవసరముందని దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ జేపీ డుమిని అభిప్రాయపడ్డాడు. పరిస్థితులకు తగినట్లుగా వీరిద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేశారని, సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు విసిరి తమను కట్టడి చేశారని ప్రశంసించాడు. వారి గూగ్లీలకు తమవద్ద సమాధానం లేకపోయిందని, వారిపై రచించిన వ్యూహాలన్నీ పనికిరాకుండా పోయాయని పేర్కొన్నాడు. వన్డే సిరీస్‌లో తమ పని అయిపోలేదని, నాలుగోవన్డేకు ముందు తమజట్టు తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరముందని తెలిపాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో తాము చక్కని భాగస్వామ్యం నమోదు చేశామని, అయితే కెప్టెన్ ఐదెన్ మార్క్‌రమ్ ఔటైన తర్వాత పరిస్థితి మారిందని చెప్పుకొచ్చాడు.
సరైన భాగస్వామ్యాలు లేకపోవడమే సిరీస్‌లో తమ ఓటములకు కారణమని అంగీకరించాడు. మరోవైపు మూడోవన్డేలో సెంచరీ చేసిన కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. తను ప్రపంచ అత్యుత్తమ ఆటగాడని, తనను ఔట్ చేయాలంటే బౌలర్లు విభిన్నమైన వ్యూహాల్ని రూపొందించాల్సిన అవసరముందని పేర్కొన్నాడు. మరోవైపు నాలుగోవన్డేకు విధ్వంసక బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ అందుబాటులోకి రావడం తమ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని డుమిని అభిప్రాయపడ్డాడు. వన్డే క్రికెట్‌లో తనో అత్యుత్తమ ఆటగాడని, తన నాయకత్వ లక్షణాలు జట్టుకు ఎంతో విలువ తెస్తుందని డుమిని అభిప్రాయపడ్డాడు. కేప్‌టౌన్ వన్డేలో చహల్, కుల్దీప్‌లు చెరో నాలుగు వికెట్లతో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో వీరిద్దరూ కలిపి ఏకంగా 21 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈక్రమంలో 304 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్ 40 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment