స్మిత్ వర్సెస్ కోహ్లి
మొహాలి: టీ20 ప్రపంచకప్ భారత్, ఆస్ట్రేలియా కీలక సమరంలో ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి కీలకం కానున్నారు. విపత్కర పరిస్థితుల్లో చెలరేగడంలో ఇద్దరూ ఇద్దరే. పాకిస్థాన్ తో జరిగిన కీలక మ్యాచ్ లో కోహ్లి అర్ధసెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. పాకిస్థాన్ తోనే జరిగిన మ్యాచ్ లో స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. జట్టు కిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆపద్భాందవుల పాత్ర పోషించడంతో ఎవరికి వారే సాటి.
ఆదివారం మొహాలిలో భారత్-ఆసీస్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ యువ బ్యాట్స మెన్ల మీద నెలకొంది. ముఖ్యంగా టీమిండియాపై బెస్ట్ రికార్డు ఉన్న స్మిత్ ను కట్టడిచేయకుంటే ధోని సేనకు కష్టాలు తప్పవు. ఇప్పటివరకు 29 టీ20 మ్యాచ్ లు ఆడిన స్మిత్ 22.57 సగటుతో 429 పరుగులు సాధించాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 90. జట్టు విజయంలో 17 సార్లు కీలకపాత్ర పోషించాడు. స్ట్రైక్ రేటు 123.98.
కోహ్లి విషయానికి వస్తే ఇప్పటివరకు 41 టీ20 మ్యాచ్ లు ఆడి 55.50 సగటుతో 1470 పరుగులు చేశాడు. అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు 90 నాటౌట్. 28 సార్లు టీమిండియా గెలుపులో ప్రధాన భూమిక పోషించాడు. స్ట్రైక్ రేటు 131.72. గణాంకాల పరంగా చూస్తే టీ20ల్లో స్మిత్ పై కోహ్లిదే పైచేయి. ఈ రోజు జరిగే మ్యాచ్ లో వీరిద్దరూ ఎలా ఆడతారనే దాని గురించి క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.