
కోహ్లి అవుటా... నాటౌటా!
చాలా రోజుల తర్వాత కోహ్లికి కోపం వచ్చింది!
చాలా రోజుల తర్వాత కోహ్లికి కోపం వచ్చింది! సిరీస్‌లో వరుస వైఫల్యాల తర్వాత ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలనే పట్టుదలతో బరిలోకి దిగిన అతడి వికెట్‌ను డీఆర్‌ఎస్ బలి తీసుకోవడమే అందుకు కారణం. హాజల్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్ 35వ ఓవర్లో నేరుగా వచ్చిన బంతి కోహ్లి ప్యాడ్‌లకు తగలగానే అర క్షణంలో అంపైర్ నైజేల్ లాంగ్ అవుట్‌గా ప్రకటించారు. నిజానికి బౌలర్ హాజల్‌వుడ్ కూడా బంతి ముందు బ్యాట్‌కు తగిలిందనే అనుకొని నిరాశతో అప్పీల్ చేస్తూ ఆగిపోయాడు. అదే నమ్మకంతో ఉన్న కోహ్లి కూడా వెంటనే రివ్యూ కోరాడు. ఆ సమయంలో కూడా అతను బ్యాట్‌కే బంతి తగిలిందన్నట్లుగా ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. అయితే మూడో అంపైర్ కెటిల్‌బరో సూపర్ స్లో మోషన్, అల్ట్రా ఎడ్జ్ కెమెరా టెక్నాలజీ ద్వారా సుదీర్ఘ సమయం పాటు పదే పదే రీప్లేలు చూసినా స్పష్టత రాలేదు.
‘ముందుగా బ్యాట్‌కు బంతి తగిలినట్లు ఎలాంటి కచ్చితమైన రుజువు లేదు’ అని కెటిల్‌బరో, ఫీల్డ్ అంపైర్‌కు వెల్లడించారు. డీఆర్‌ఎస్ నిబంధనల ప్రకారం ఫీల్డ్ అంపైర్ ఇచ్చేదే తుది నిర్ణయం కాబట్టి కోహ్లి అవుట్ కాక తప్పలేదు. దాంతో భారత కెప్టెన్ తిరిగి వెళుతూ తీవ్ర అసంతృప్తిని ప్రదర్శించాడు. ఇదేంటి అన్నట్లుగా తన బ్యాట్‌ను చూపిస్తూ ఆగ్రహంతో మైదానం వీడాడు. కోహ్లి వికెట్‌పై మాట్లాడుతూ హాజల్‌వుడ్... హాట్‌స్పాట్ ఉంటే సరైన ఫలితం వచ్చేదని అభిప్రాయపడ్డాడు. టెక్నాలజీలో మరో భాగం, ఇన్‌ఫ్రారెడ్ కిరణాలతో పని చేసే హాట్‌స్పాట్‌ను మాత్రం భారత్‌లో ఇంకా వాడటం లేదు.