'రిటైర్మెంట్'వార్తలు నిజం కాదు: సెహవాగ్
రిటైర్ మెంట్ వార్తలపై భారత స్టార్ బ్యాట్స్ వీరేంద్ర సెహవాగ్ స్పందించారు. సమాచార లోపం వల్ల మీడియా పొరపడిందని, అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. 'ఆ వార్తలు అధికారికంగా వెల్లడించినవికావు. సమాచారలోపం వల్ల పుట్టుకొచ్చినవే' అని సెహవాగ్ అన్నారు.
కాగా సెహవాగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారంటూ సోమవారం రాత్రి ప్రముఖ ఛానెళ్లన్నీ వార్తలు ప్రసారం చేశాయి. ఓవైపు వయసు మీదపడుతుండటం, గడిచిన రెండున్నరేళ్ల కాలంగా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలయం కావడంతో సెహ్వాగ్ రిటైర్ మెంట్ అనివార్యమైందని పేర్కొన్నాయి.
ప్రస్తుతం దుబాయ్ లో మాస్టర్స్ సిరీస్ లో ఆడుతోన్న వీరేంద్ర సెహవాగ్.. 'ఈ సిరీస్ పూర్తయిన తర్వాత రిటైర్ మెంట్ పై ఓ నిర్ణయానికి వస్తా' అని మాత్రమే తాను అన్నానన, అది కూడా క్యాజువల్ గానే నని చెప్పుకొచ్చారు. ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తున్న వార్తలపై స్వయంగా సెహవాగే ప్రకటన చేయడంతో అస్పష్టతకు తెరపడినట్లయింది.
భారతీయ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్ లో ఆడి తనదైన శైలీలో ఘనతను చాటాడు. వన్డే, టెస్టు మ్యాచ్ లలో దూకుడుగా ఆడి సెంచరీలతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ చరిత్రలో చెరగని ముద్రను వేశాడు.
భారత క్రికెటర్ గా ప్రపంచస్థాయిలో తన ప్రస్థానం కొనసాగించిన అతడు కుడిచేతి వాటం గల బ్యాట్స్ మెన్ గానూ, బౌలింగ్ లో హాఫ్ స్పిన్నర్ గానూ అత్యుత్తమ ప్రదర్శనతో చెలరేగి ఆడాడు. చాలా ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఫామ్ లేమితో జట్టుకు దూరమైన సెహవాగ్.. రెండెన్నరేళ్లుగా టీమిండియాలో చోటు కోసం ఎదురు చూస్తున్నాడు.
► భారత్ తరపున 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ 20 మ్యాచ్లు ఆడిన సెహ్వాగ్
► వన్డేల్లో 15 సెంచరీలు, టెస్టుల్లో 23 సెంచరీలు
► 251 వన్డేల్లో 8273 పరుగులు
► 104 టెస్టుల్లో 8586 పరుగులు
► 19 టీ 20 మ్యాచ్ల్లో 394 పరుగులు