మ్యాచ్ రిఫరీకి ఇంగ్లండ్ ఫిర్యాదు!
నాగ్పూర్:భారత్ తో జరిగిన రెండో ట్వంటీ 20లో తమ ఓటమికి అంపైరింగే ప్రధాన కారణమని భావిస్తున్న ఇంగ్లండ్..మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేయడానికి సిద్ధమైంది. ప్రధానంగా చివరి ఓవర్లో జో రూట్ను ఎల్బీడబ్యూగా ప్రకటించిన అంపైర్ షంషుద్దీన్పై ఫిర్యాదు చేయనుంది. ఈ మేరకు జో రూట్ అవుట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మెర్గాన్.. అంపైరింగ్ నాణ్యతకు సంబంధించిన ఫీడ్ బ్యాక్తో రిఫరీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు. 'విజయం మా చేతుల్లోకి వచ్చి చేజారింది. క్లిష్ట సమయంలో జో రూట్ వివాదాస్పదంగా అవుట్ కావడం మా ఓటమికి కారణమైంది. దీనిపై రిఫరీకి ఫిర్యాదు చేయనున్నాం. ట్వంటీ 20ల్లో డీఆర్ఎస్ ఎందుకు లేదో అర్థం కావడం లేదు'అని మోర్గాన్ ఆందోళన వ్యక్తం చేశాడు. తమ ఇన్నింగ్స్ 20.0 ఓవర్ లో జో రూట్ అవుట్ కావడమే మ్యాచ్ ను మలుపు తిప్పిందన్నాడు. ఒకవేళ జో రూట్ అవుట్ ను తాము సవాల్ చేసే అవకాశం ఉంటే కచ్చితంగా మ్యాచ్ ను గెలిచేవాళ్లమని ధీమా వ్యక్తం చేశాడు.
రెండో ట్వంటీ 20లో చివరి ఓవర్ లో జోరూట్ను బూమ్రా తన తొలి బంతికే ఎల్బీగా అవుట్ చేశాడు. అయితే ఆ బంతి జో రూట్ బ్యాట్కు తగిలిన తరువాతే అతని ప్యాడ్లకు తాకినట్లు రీప్లేలో స్పష్టమైంది. కొన్ని సందర్బాల్లో ఇలా జరగడం సర్వసాధారణమే అయినప్పటికీ, అదే తాము మ్యాచ్ ను కోల్పోవడానికి కారణమైందంటూ ఇంగ్లండ్ వాపోతుంది. ఫలితాన్ని తారుమారు చేసిన నిర్ణయం కావడంతో ఇంగ్లండ్ సిరీయస్ గా ఉంది. దీనిపై ఇంగ్లండ్ యాజమాన్యంతో పాటు, ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ మ్యాచ్ ను ఇంగ్లండ్ గెలిచి ఉంటే ఈ అంశం పెద్దగా చర్చకు వచ్చేది కాదు. ఓటమిని జీర్ణించుకోలేని ఇంగ్లండ్.. అదే అవుట్ ను ప్రత్యేకంగా ఎత్తిచూపుతూ రిఫరీకి ఫిర్యాదు చేయడానికి సిద్ధమైంది. ఈ ఫిర్యాదుతో తాము ఓడిపోలేదు..అంపైరింగ్ మాత్రమే ఓడించింది అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి సానుభూతి పొందాలనే ఇంగ్లండ్ భావనగా కనబడుతోంది.