మహబూబ్‌నగర్ క్రీడలు: తమ పిల్లలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు తదితర ప్రొఫెషనల్స్‌గా ఎదగాలని చదువు.. చదువు అంటూ వెంటపడే తల్లిదండ్రులున్న రోజులివి.. కానీ తమ కొడుకు క్రికెట్‌లో రాణించాలని, అంతర్జాతీయస్థాయికి ఎదగాలని, అందుకోసం ఎంత కష్టాన్నయినా భరిస్తానని పరితపిస్తున్నాడు జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లికి చెందిన పోలీస్ ఉద్యోగి రమేష్‌యాదవ్. తన కుమారులు రాకేశ్‌యాదవ్, హృతిక్‌యాదవ్‌లను క్రికెట్ శిక్షణ కోసం ఇంటివద్దే రెండు నెట్‌లు ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నాడు. ఇంటి ఆవరణలో టర్ఫ్, సిమెంట్ పిచ్‌లను ఏర్పాటు చేశాడు. మూడేళ్ల క్రితం బెంగళూర్‌లోని ప్రసిద్ధ బ్రిజేష్‌పటేల్ క్రికెట్ అకాడమీలో రెండునెలలపాటు ఇద్దరు కుమారులకు శిక్షణ ఇప్పించాడు.
అండర్ –14లో మెరిసిన హృతిక్‌యాదవ్
రాకేశ్‌యాదవ్ అండర్–19, అండర్–23 విభాగాల్లో మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారు. హృతిక్‌యాదవ్ ఆల్‌రౌండర్‌గా సత్తాచాటుతున్నాడు. తన లెగ్‌స్పిన్ మాయాజాలంతో మ్యాచుల్లో వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. లెఫ్ట్‌హ్యాండర్ బ్యాటింగ్, లెగ్‌స్పిన్‌తో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాడు. 2013 హైదరాబాద్‌లో జరిదిన అండర్–14 ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి టోర్నీలో కరీంనగర్‌పై 13 పరుగులు ఐదు వికెట్లు తీసి అందరి దృష్టిలో పడ్డాడు. వయస్సు తక్కువగా ఉన్న కారణంతో ఆ ఏడాది జాతీయస్థాయి పోటీలకు ఎంపికకాలేదు. 2015 హైదరాబాద్‌లో జరిగిన అండర్–14 క్రికెట్ టోర్నీలో స్పిన్నర్ హృతిక్‌యాదవ్ మెరిశాడు.
టోర్నీలో 12 వికెట్లు తీసి బెస్ట్ బౌలర్‌గా నిలిచాడు. సెమీఫైనల్‌లో నిజామాబాద్‌పై, ఫైనల్ మ్యాచ్‌లో వరంగల్‌పై ఐదేసి వికెట్లు తీసి రాణించాడు. 2015లో జిల్లా కేంద్రంలో జరిగిన అండర్–14 ఎస్‌జీఎఫ్ జాతీయస్థాయి క్రికెట్ టోర్నీలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాడు. 2016 ఎస్‌జీఎఫ్, హెచ్‌సీఏ టోర్నీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించాడు. మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2015, 2017లో నిర్వహించిన (మహబూబ్‌నగర్ ప్రీమియర్ లీగ్) ఎంపీఎల్‌లో ఆడాడు. గత నెలలో సంగారెడ్డి జిల్లా బీహెచ్‌ఈఎల్‌లో జరిగిన అండర్–17 రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ టోర్నీలో మెరుగైన ప్రతిభ కనబరిచాడు. ఈ టోర్నీలో 43పరుగులు చేయడంతోపాటు బౌలింగ్‌లో ఆరు వికెట్లు తీశాడు. 2016లో బెంగళూర్‌లో అండర్–14 టోర్నీలో హెచ్‌సీఏ–బి జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
హెచ్‌సీఏ అండర్–16 టోర్నీలో హృతిక్ సంచలనం
మూడురోజులుగా హైదరాబాద్‌లోని డానియల్ అకాడమీ మైదానంలో జరుగుతున్న హెచ్‌సీఏ అండర్–16 టోర్నీ సత్తాచాటాడు. కరీంనగర్ జట్టుపై తన స్పిన్‌బౌలింగ్‌తో ప్రతిభ కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో 5.4 ఓవర్లలో కేవలం 11 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు తీశాడు. జిల్లా తరపున అండర్–14, అండర్–16 హెచ్‌సీఏ క్రికెట్‌లో ఏడు వికెట్లు తీసి రికార్డ్‌గా నిలిచాడు.
భారత జట్టుకు ఆడడమే లక్ష్యం
క్రికెట్ కెరీర్‌లో నాన్న ప్రోత్సాహం ఎంతో ఉంది. ఎన్ని పనులు ఉన్నా క్రికెట్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఆయన నమ్మకాన్ని వమ్ముచేయకుండా నావంతు ప్రతిభ కనబరుస్తున్నాను. నిత్యం పిల్లలమర్రి సమీపంలోని ఎండీసీఏ క్రికెట్ మైదానంలో కోచ్‌ల వద్ద ప్రత్యేక కోచింగ్ తీసుకుంటున్నాను. ఇంకా చాలా ప్రాక్టిస్ చేసి, కష్టపడి రంజీ, భారతజట్టుకు ఆడడమే నా లక్ష్యం.
–హృతిక్‌యాదవ్
Comments
Please login to add a commentAdd a comment