సొంతగడ్డపై మ్యాచ్... తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల భారీ ఆధిక్యం... ప్రత్యర్థి జట్టులో పెద్దగా గుర్తింపు లేని స్పిన్నర్లు... 231 పరుగుల స్వల్ప లక్ష్యం... అయినా సరే... భారత జట్టు అనూహ్య రీతిలో ఓటమిని ఆహ్వానించింది... ఇంగ్లండ్ బౌలర్లకు తలవంచుతూ పేలవ బ్యాటింగ్‌తో కుప్పకూలింది. నాలుగో రోజు పిచ్‌పై స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు తడబడుతూ మన బ్యాటర్లు డిఫెన్స్ ఆడటం గతంలో ఎన్నడూ చూడనిది. కానీ తొలి టెస్టులో అలాంటి దృశ్యమే కనిపించింది. చివరకు హైదరాబాద్‌లో పరాజయం పలకరించింది.
రెండో ఇన్నింగ్స్ ఆడుతూ తొలి ఇన్నింగ్స్ లోటును పూడ్చుకునే లోపే ఐదుగురు బ్యాటర్లు పెవిలియన్‌కు... ఎదురుగా ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలింగ్ బలగం... వీటన్నింటిని దాటి సాగిన ఒలీ పోప్ అత్యద్భుత ఇన్నింగ్స్ ఇంగ్లండ్‌కు ఆశలు రేపింది. ఆపై భారత్‌ను నిలువరించగలమా అనే సందేహాల మధ్య టామ్ హార్లీ నేనున్నానంటూ వచ్చాడు. తొలి బంతికి సిక్సర్ ఇచ్చి కెరీర్ మొదలు పెట్టిన అతను చివరి వికెట్ సహా 7 వికెట్లు తీసి సూపర్ అనిపించాడు. టెస్టులో రెండు రోజుల పాటు వెనుకబడి కూడా ఆఖరికి అసలైన ఆటతో ఇంగ్లండ్ జట్టు విదేశీ గడ్డపై చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది.
సాక్షి, హైదరాబాద్: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత్‌కు ఊహించని విధంగా గట్టి దెబ్బ తగిలింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నాలుగో రోజే ముగిసిన తొలి టెస్టులో టీమిండియాకు ఓటమి ఎదురైంది. పలు మలుపులతో సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. 231 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 69.2 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ రోహిత్ శర్మ (58 బంతుల్లో 39; 7 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
తొలి టెస్టు ఆడిన ఎడంచేతి వాటం స్పిన్నర్ టామ్ హార్లీ 62 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టడం విశేషం. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 316/6తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 420 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఒలీ పోప్ (278 బంతుల్లో 196; 21 ఫోర్లు) త్రుటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. తాజా ఫలితంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలో జరుగుతుంది.
చేజారిన డబుల్ సెంచరీ...
నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసేందుకు భారత్‌కు ఎక్కువ సమయమే పట్టింది. రేహన్ అహ్మద్ (53 బంతుల్లో 28; 3 ఫోర్లు)ను బుమ్రా వెనక్కి పంపినా... పోప్ జోరు తగ్గలేదు. అతనికి టామ్ హార్లీ (52 బంతుల్లో 34; 4 ఫోర్లు) అండగా నిలవడంతో కీలక భాగస్వామ్యం నమోదైంది. ఈ దశలోనే వీరిద్దరిని నిలువరించడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. పోప్, హార్లీ ఎనిమిదో వికెట్‌కు 80 పరుగులు జోడించడం విశేషం. ఎట్టకేలకు ఒకే స్కోరు వద్ద హార్లీ, వుడ్ (0)లను భారత్ అవుట్ చేయగా... బుమ్రా బౌలింగ్‌లో ర్యాంప్‌షాట్‌కు ప్రయత్నించి పోప్ డబుల్ సెంచరీని చేజార్చుకోవడంతో ఇన్నింగ్స్ ముగిసింది. ఆదివారం ఇంగ్లండ్ 25.1 ఓవర్లు ఆడి 104 పరుగులు చేసింది.
పేలవ బ్యాటింగ్‌తో...
ఛేదనను కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ (15) మెరుగ్గానే ఆరంభించారు. అయితే ఒకే ఓవర్లో యశస్వి, శుబ్‌మన్ గిల్ (0)లను అవుట్ చేసి భారత్‌ను దెబ్బ కొట్టిన హార్లీ... కొద్దిసేపటికే రోహిత్‌ను కూడా వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో భారత్ కష్టాల్లో పడింది. టీ విరామం తర్వాత ఇంగ్లండ్ బౌలర్లు మరింతగా పట్టు బిగించి టీమిండియా బ్యాటర్లను పూర్తిగా కట్టిపడేశారు.
ఫలితంగా 12 పరుగుల వ్యవధిలో అక్షర్ పటేల్ (17), కేఎల్ రాహుల్ (22) వెనుదిరగ్గా, ఒకే స్కోరు వద్ద రవీంద్ర జడేజా (2), శ్రేయస్ అయ్యర్ (13) అవుటయ్యారు. అనవసరపు సింగిల్‌కు ప్రయతి్నంచిన జడేజాను అద్భుతమైన త్రోతో స్టోక్స్ రనౌట్ చేయగా... శ్రేయస్ మళ్లీ చెత్త షాట్‌తో నిష్క్రమించాడు. ఈ దశలోనే భారత్ ఓటమి ఖాయమైనట్లుగా అనిపించింది. అయితే కోన శ్రీకర్ భరత్ (59 బంతుల్లో 28; 3 ఫోర్లు), రవిచంద్రన్ అశి్వన్ (84 బంతుల్లో 28; 2 ఫోర్లు) పట్టుదలగా పోరాడి విజయంపై ఆశలు రేపారు.
చివర్లో ఉత్కంఠ...
భరత్, అశి్వన్ జత కలిసే సమయానికి భారత్ స్కోరు 119/7... విజయానికి మరో 112 పరుగులు కావాలి. ఈ సమయంలో వీరిద్దరు గట్టిగా నిలబడ్డారు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడినా ఆ తర్వాత ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొంటూ స్వేచ్ఛగా పరుగులు చేశారు. ఒత్తిడి పెరగడంతో ఇంగ్లండ్ బౌలర్లు, ఫీల్డర్లలో తడబాటు కనిపించింది. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 57 పరుగులు జత చేశారు. మరో 55 పరుగులు అవసరం.
ఈ స్థితిలో హార్లీ చక్కటి బంతితో భరత్‌ను బౌల్డ్ చేసి భాగస్వామ్యాన్ని విడదీయగా... తప్పనిసరి పరిస్థితుల్లో భారీ షాట్‌కు ప్రయతి్నంచి అశ్విన్ వెనుదిరిగాడు. ఈ వికెట్ పడిన తర్వాత ఫలితం కోసం నిబంధనల ప్రకారం అంపైర్లు అరగంట ఆటను పొడిగించారు. చివరి వికెట్‌కు కొన్ని షాట్లతో సిరాజ్ (12), బుమ్రా (6 నాటౌట్) కూడా 25 పరుగులు జోడించడంతో మరో 29 పరుగులే మిగిలాయి. ఆదివారం మరో ఓవర్ మిగిలి ఉండగా... దీనిని ఆడుకుంటే ఆట చివరి రోజుకు వెళ్లేది. కానీ రెండో బంతికి సిరాజ్ స్టంపౌట్ కావడంతో భారత్ కథ ముగిసింది.
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 246 ఆలౌట్;
భారత్ తొలి ఇన్నింగ్స్: 436 ఆలౌట్;
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 420 ఆలౌట్;
భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) హార్లీ 39; యశస్వి (సి) పోప్ (బి) హార్లీ 15; గిల్ (సి) పోప్ (బి) హార్లీ 0; రాహుల్ (ఎల్బీ) (బి) రూట్ 22; అక్షర్ (సి అండ్ బి) హార్లీ 17; శ్రేయస్ (సి) రూట్ (బి) లీచ్ 13; జడేజా (రనౌట్) 2; భరత్ (బి) హార్లీ 28; అశి్వన్ (స్టంప్డ్) ఫోక్స్ (బి) హార్లీ 28; బుమ్రా (నాటౌట్) 6; సిరాజ్ (స్టంప్డ్) ఫోక్స్ (బి) హార్లీ 12; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (69.2 ఓవర్లలో ఆలౌట్) 202.
వికెట్ల పతనం: 1–42, 2–42, 3–63, 4–95, 5–107, 6–119, 7–119, 8–176, 9–177, 10–202.
బౌలింగ్: రూట్ 19–3– 41–1, వుడ్ 8–1–15–0 హార్లీ 26.2–5–62–7 లీచ్ 10–1–33–1, రేహన్ 6–0–33–0.
Comments
Please login to add a commentAdd a comment