క్రికెట్‌లో నిత్య విద్యార్థి అశ్విన్
ఆటపై అసాధారణ పరిజ్ఞానం
ప్రతి మ్యాచ్‌కూ పకడ్బందీ సన్నద్ధత
వ్యూహ రచనల్లో తనకు తానే సాటి
క్లిష్ట పరిస్థితుల్లో జట్టుకు ఆపన్నహస్తం
సాక్షి క్రీడా విభాగం : భారత్, ఆ్రస్టేలియా మధ్య అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టుకు రెండు రోజుల ముందు అశ్విన్ మైదానానికి వెళ్లాడు. తనకు తెలిసిన ఒక మీడియా మిత్రుడిని పిలిచి అంతకుముందు అక్కడ జరిగిన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ వీడియోలు ఎక్కడైనా దొరుకుతాయా అని అడిగాడు. స్పిన్నర్ లాయిడ్ పోప్ ఆ మ్యాచ్‌లో చెలరేగడాన్ని గుర్తు చేస్తూ పిచ్ ఎలా స్పందిస్తుందనే విషయాన్ని తెలుసుకునేందుకు అతను ప్రయత్నించాడు. ఒక టెస్టు మ్యాచ్ కోసం అశ్విన్ చేసే సన్నద్ధత ఇది.
ఇలా సిద్ధం కావడం అశ్విన్ కెరీర్‌లో ఇది మొదటిసారేమీ కాదు. తాను ఆటలో అడుగు పెట్టిన నాటినుంచి ప్రతీ సిరీస్‌కు, ప్రతీ మ్యాచ్‌కు, ప్రతీ ఓవర్‌కు, ప్రతీ బంతికి కొత్త తరహాలో వ్యూహరచన చేయడం అతనికే చెల్లింది. ఆటపై అసాధారణ పరిజ్ఞానం, చురుకైన బుర్ర, భిన్నంగా ఆలోచించే తత్వం అతడిని అగ్ర స్థానానికి చేర్చాయి. సాంప్రదాయ ఆఫ్‌స్పిన్‌లో అత్యుత్తమ నైపుణ్యం మాత్రమే కాకుండా క్యారమ్ బాల్, ఆర్మ్ బాల్ అతని ఆయుధాలుగా ప్రత్యర్థి బ్యాటర్లను పడగొట్టాయి.
స్పిన్ బౌలింగ్‌కు సైన్స్‌ను జోడిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది ఇంజినీరింగ్ చదివిన అశ్విన్ నిరూపించాడు. అశ్విన్ చేతికి బంతి ఇస్తే చాలు... భారత కెపె్టన్‌కు ఒక ధైర్యం వచ్చేస్తుంది. అతడికి నమ్మి బౌలింగ్ అప్పగిస్తే ఇక గుండెల మీద చేయి వేసుకొని ప్రశాంతంగా ఉండవచ్చనేది వారి భావన. ఆరంభంలోనే బ్యాటర్లను కట్టడి చేయాలన్నా, భారీ భాగస్వామ్యాలను విడదీయాలన్నా, ఓటమి దిశగా వెళుతున్న సమయంలో కూడా రక్షించాలన్నా అశ్విన్ ఆపన్నహస్తం సిద్ధంగా ఉండేది!
అశ్విన్ తెలివితేటలు టీమిండియాకు అదనపు బలాన్ని ఇచ్చాయి. తన బౌలింగ్ విషయంలోనే కాదు నాయకుడికి ఒక మంత్రిలా అండగా నిలవడంలో అతనికి అతనే సాటి. ఎన్నో ప్రణాళికల్లో, వ్యూహాల్లో అశ్విన్ భాగస్వామి. ఆటపై అతని సునిశిత పరిశీలన, వైవిధ్యమైన ఆలోచనాశైలితో ఎన్నోసార్లు అతను మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు పతనానికి కారకుడయ్యాడు.
దురదృష్టవశాత్తూ సుదీర్ఘ కెరీర్‌లో ఒక్కసారి కూడా భారత్‌కు సారథిగా వ్యవహరించే అవకాశం రాకపోవడం మాత్రం ఒక లోటుగా ఉండిపోయింది. పైగా ఇంత గొప్ప కెరీర్ తర్వాత ఎలాంటి వీడ్కోలు మ్యాచ్ లేకుండా, ఘనమైన ముగింపు లేకుండా అతను తన ఆఖరి ఆట ఆడేయడం కూడా కాస్త చివుక్కుమనిపించేదే.
దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రిటైర్ అయిపోగా, కెరీర్ చివర్లో వరుస వైఫల్యాలతో హర్భజన్ సింగ్ ఇబ్బంది పడుతున్న దశలో అశ్విన్ కెరీర్ మొదలైంది. ముందుగా ఐపీఎల్, ఆపై వన్డే, టి20ల్లో ప్రదర్శనతో అందరి దృష్టిలో పడినా... తర్వాతి రోజుల్లో టెస్టు బౌలర్‌గా తన ముద్ర వేయగలిగి∙అరుదైన ఆటగాళ్లలో ఒకడిగా అతను నిలిచాడు. 2011లో ఆడిన తొలి టెస్టులోనే 9 వికెట్లతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా మొదలైన అతని ఆట అద్భుత కెరీర్‌కు నాంది పలికింది.
తొలి 16 టెస్టుల్లోనే 9సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం అశ్విన్ స్థానాన్ని సుస్థిరం చేసింది. 2016–17 సీజన్‌లో నాలుగు సిరీస్‌లలో కలిపి 13 టెస్టుల్లో ఏకంగా 82 వికెట్లు పడగొట్టడం అశ్విన్ కెరీర్‌లో ఉచ్ఛదశ. ఒకటా, రెండా... ఎన్నో గుర్తుంచుకోదగ్గ గొప్ప ప్రదర్శనలు అతని స్థాయిని పెంచాయి. అశ్విన్ బంతులను ఎదుర్కోలేక ఉత్తమ బ్యాటర్లు కూడా పూర్తిగా తడబడి చేతులెత్తేసిన రోజులు ఎన్నో!
స్టీవ్ స్మిత్, విలియమ్సన్, రూట్, డివిలియర్స్, అలిస్టర్ కుక్, డీన్ ఎల్గర్, డేవిడ్ వార్నర్, మైకేల్ క్లార్క్, కుమార సంగక్కర, మహేళ జయవర్ధనే, బెన్ స్టోక్స్...అశ్విన్ ముందు తలవంచిన ఇలాంటి బ్యాటర్ల జాబితా చాలా పెద్దది. స్వదేశంలో అసాధారణ ఘనతల మధ్య అతడిని విమర్శించేందుకు కొందరు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ( ఉNఅ) దేశాల్లో అతని ప్రదర్శనను చూపిస్తుంటారు.
ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శన లేకపో యినా అతని బౌలింగ్ మరీ పేలవంగా ఏమీ లేదు. ఆయా పరిస్థితులను బట్టి తనకు తక్కువ అవకాశాలు వచ్చాయని (26 టెస్టులే ఆడాడు)... తన రికార్డును సవరించే అవకాశం కూడా ఎక్కువగా దక్కలేదని దీనిపై అశ్విన్ చెప్పుకున్నాడు.
»ౌలింగ్‌కు తోడు అశ్విన్ బ్యాటింగ్ నైపుణ్యం అతడిని ఆల్‌రౌండర్ స్థాయికి చేర్చింది. ‘అండర్–17 స్థాయినుంచి నేను అశ్విన్‌తో కలిసి ఆడాను. అప్పట్లో అతను ఓపెనర్. కొన్నాళ్ల విరామం తర్వాత మేం తమిళనాడు జట్టు నుంచి అశ్విన్ అనే బౌలర్ అద్భుత గణాంకాలు చూసి అతను ఇతను వేరు అనుకున్నాం. ఎందుకంటే మాకు తెలిసిన అశ్విన్ బ్యాటర్ మాత్రమే. టెస్టు ఆటగాడిగా మనం ఎన్నో మంచి బ్యాటింగ్ ప్రదర్శనలు చూశాం. దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు’ అని రోహిత్ బుధవారం గుర్తు చేసుకున్నాడు.
ఆఫ్‌స్పిన్నర్‌గా ఎదగక ముందు ఉన్న ఆ అనుభవం భారత జట్టుకు కూడా కీలకంగా పనికొచి్చంది. టెస్టుల్లో ఎందరో బౌలర్లకు సాధ్యం కాని రీతిలో నమోదు చేసిన 6 సెంచరీలు అసాధారణ ప్రదర్శన. ఇటీవల బంగ్లాదేశ్‌తో చెన్నైతో జరిగిన టెస్టులో భారత్ 144/6 వద్ద ఉన్నప్పుడు చేసిన శతకం అతని బ్యాటింగ్ విలువను చూపించింది.
2019 సిడ్నీ టెస్టులో తనను కాదని కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇవ్వడంతో పాటు విదేశాల్లో ఇతనే మా ప్రధాన స్పిన్నర్ అంటూ కోచ్ రవిశాస్త్రి చెప్పిన మాట అశ్విన్‌ను అప్పట్లో తీవ్రంగా బాధించింది. దానిని అతను ఆ తర్వాత చాలాసార్లు గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత దాదాపు అదే తరహా అనుభవాన్ని ఎదుర్కొంటూ మరొకరికి అవకాశం ఇవ్వకుండా తనంతట తానే రిటైర్మెంట్‌ను ప్రకటించాడు.
Comments
Please login to add a commentAdd a comment