ravichandran aswin
-
‘మిస్టర్ మేధావి’
సాక్షి క్రీడా విభాగం : భారత్, ఆ్రస్టేలియా మధ్య అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టుకు రెండు రోజుల ముందు అశ్విన్ మైదానానికి వెళ్లాడు. తనకు తెలిసిన ఒక మీడియా మిత్రుడిని పిలిచి అంతకుముందు అక్కడ జరిగిన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ వీడియోలు ఎక్కడైనా దొరుకుతాయా అని అడిగాడు. స్పిన్నర్ లాయిడ్ పోప్ ఆ మ్యాచ్‌లో చెలరేగడాన్ని గుర్తు చేస్తూ పిచ్ ఎలా స్పందిస్తుందనే విషయాన్ని తెలుసుకునేందుకు అతను ప్రయత్నించాడు. ఒక టెస్టు మ్యాచ్ కోసం అశ్విన్ చేసే సన్నద్ధత ఇది. ఇలా సిద్ధం కావడం అశ్విన్ కెరీర్లో ఇది మొదటిసారేమీ కాదు. తాను ఆటలో అడుగు పెట్టిన నాటినుంచి ప్రతీ సిరీస్‌కు, ప్రతీ మ్యాచ్‌కు, ప్రతీ ఓవర్‌కు, ప్రతీ బంతికి కొత్త తరహాలో వ్యూహరచన చేయడం అతనికే చెల్లింది. ఆటపై అసాధారణ పరిజ్ఞానం, చురుకైన బుర్ర, భిన్నంగా ఆలోచించే తత్వం అతడిని అగ్ర స్థానానికి చేర్చాయి. సాంప్రదాయ ఆఫ్‌స్పిన్‌లో అత్యుత్తమ నైపుణ్యం మాత్రమే కాకుండా క్యారమ్ బాల్, ఆర్మ్ బాల్ అతని ఆయుధాలుగా ప్రత్యర్థి బ్యాటర్లను పడగొట్టాయి.స్పిన్ బౌలింగ్‌కు సైన్స్‌ను జోడిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది ఇంజినీరింగ్ చదివిన అశ్విన్ నిరూపించాడు. అశ్విన్ చేతికి బంతి ఇస్తే చాలు... భారత కెపె్టన్‌కు ఒక ధైర్యం వచ్చేస్తుంది. అతడికి నమ్మి బౌలింగ్ అప్పగిస్తే ఇక గుండెల మీద చేయి వేసుకొని ప్రశాంతంగా ఉండవచ్చనేది వారి భావన. ఆరంభంలోనే బ్యాటర్లను కట్టడి చేయాలన్నా, భారీ భాగస్వామ్యాలను విడదీయాలన్నా, ఓటమి దిశగా వెళుతున్న సమయంలో కూడా రక్షించాలన్నా అశ్విన్ ఆపన్నహస్తం సిద్ధంగా ఉండేది! అశ్విన్ తెలివితేటలు టీమిండియాకు అదనపు బలాన్ని ఇచ్చాయి. తన బౌలింగ్ విషయంలోనే కాదు నాయకుడికి ఒక మంత్రిలా అండగా నిలవడంలో అతనికి అతనే సాటి. ఎన్నో ప్రణాళికల్లో, వ్యూహాల్లో అశ్విన్ భాగస్వామి. ఆటపై అతని సునిశిత పరిశీలన, వైవిధ్యమైన ఆలోచనాశైలితో ఎన్నోసార్లు అతను మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు పతనానికి కారకుడయ్యాడు. దురదృష్టవశాత్తూ సుదీర్ఘ కెరీర్లో ఒక్కసారి కూడా భారత్‌కు సారథిగా వ్యవహరించే అవకాశం రాకపోవడం మాత్రం ఒక లోటుగా ఉండిపోయింది. పైగా ఇంత గొప్ప కెరీర్ తర్వాత ఎలాంటి వీడ్కోలు మ్యాచ్ లేకుండా, ఘనమైన ముగింపు లేకుండా అతను తన ఆఖరి ఆట ఆడేయడం కూడా కాస్త చివుక్కుమనిపించేదే. దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రిటైర్ అయిపోగా, కెరీర్ చివర్లో వరుస వైఫల్యాలతో హర్భజన్ సింగ్ ఇబ్బంది పడుతున్న దశలో అశ్విన్ కెరీర్ మొదలైంది. ముందుగా ఐపీఎల్, ఆపై వన్డే, టి20ల్లో ప్రదర్శనతో అందరి దృష్టిలో పడినా... తర్వాతి రోజుల్లో టెస్టు బౌలర్‌గా తన ముద్ర వేయగలిగి∙అరుదైన ఆటగాళ్లలో ఒకడిగా అతను నిలిచాడు. 2011లో ఆడిన తొలి టెస్టులోనే 9 వికెట్లతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా మొదలైన అతని ఆట అద్భుత కెరీర్‌కు నాంది పలికింది. తొలి 16 టెస్టుల్లోనే 9సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం అశ్విన్ స్థానాన్ని సుస్థిరం చేసింది. 2016–17 సీజన్లో నాలుగు సిరీస్‌లలో కలిపి 13 టెస్టుల్లో ఏకంగా 82 వికెట్లు పడగొట్టడం అశ్విన్ కెరీర్లో ఉచ్ఛదశ. ఒకటా, రెండా... ఎన్నో గుర్తుంచుకోదగ్గ గొప్ప ప్రదర్శనలు అతని స్థాయిని పెంచాయి. అశ్విన్ బంతులను ఎదుర్కోలేక ఉత్తమ బ్యాటర్లు కూడా పూర్తిగా తడబడి చేతులెత్తేసిన రోజులు ఎన్నో! స్టీవ్ స్మిత్, విలియమ్సన్, రూట్, డివిలియర్స్, అలిస్టర్ కుక్, డీన్ ఎల్గర్, డేవిడ్ వార్నర్, మైకేల్ క్లార్క్, కుమార సంగక్కర, మహేళ జయవర్ధనే, బెన్ స్టోక్స్...అశ్విన్ ముందు తలవంచిన ఇలాంటి బ్యాటర్ల జాబితా చాలా పెద్దది. స్వదేశంలో అసాధారణ ఘనతల మధ్య అతడిని విమర్శించేందుకు కొందరు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ( ఉNఅ) దేశాల్లో అతని ప్రదర్శనను చూపిస్తుంటారు. ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శన లేకపో యినా అతని బౌలింగ్ మరీ పేలవంగా ఏమీ లేదు. ఆయా పరిస్థితులను బట్టి తనకు తక్కువ అవకాశాలు వచ్చాయని (26 టెస్టులే ఆడాడు)... తన రికార్డును సవరించే అవకాశం కూడా ఎక్కువగా దక్కలేదని దీనిపై అశ్విన్ చెప్పుకున్నాడు. »ౌలింగ్కు తోడు అశ్విన్ బ్యాటింగ్ నైపుణ్యం అతడిని ఆల్‌రౌండర్ స్థాయికి చేర్చింది. ‘అండర్–17 స్థాయినుంచి నేను అశ్విన్‌తో కలిసి ఆడాను. అప్పట్లో అతను ఓపెనర్. కొన్నాళ్ల విరామం తర్వాత మేం తమిళనాడు జట్టు నుంచి అశ్విన్ అనే బౌలర్ అద్భుత గణాంకాలు చూసి అతను ఇతను వేరు అనుకున్నాం. ఎందుకంటే మాకు తెలిసిన అశ్విన్ బ్యాటర్ మాత్రమే. టెస్టు ఆటగాడిగా మనం ఎన్నో మంచి బ్యాటింగ్ ప్రదర్శనలు చూశాం. దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు’ అని రోహిత్ బుధవారం గుర్తు చేసుకున్నాడు. ఆఫ్‌స్పిన్నర్‌గా ఎదగక ముందు ఉన్న ఆ అనుభవం భారత జట్టుకు కూడా కీలకంగా పనికొచి్చంది. టెస్టుల్లో ఎందరో బౌలర్లకు సాధ్యం కాని రీతిలో నమోదు చేసిన 6 సెంచరీలు అసాధారణ ప్రదర్శన. ఇటీవల బంగ్లాదేశ్‌తో చెన్నైతో జరిగిన టెస్టులో భారత్ 144/6 వద్ద ఉన్నప్పుడు చేసిన శతకం అతని బ్యాటింగ్ విలువను చూపించింది.2019 సిడ్నీ టెస్టులో తనను కాదని కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇవ్వడంతో పాటు విదేశాల్లో ఇతనే మా ప్రధాన స్పిన్నర్ అంటూ కోచ్ రవిశాస్త్రి చెప్పిన మాట అశ్విన్‌ను అప్పట్లో తీవ్రంగా బాధించింది. దానిని అతను ఆ తర్వాత చాలాసార్లు గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత దాదాపు అదే తరహా అనుభవాన్ని ఎదుర్కొంటూ మరొకరికి అవకాశం ఇవ్వకుండా తనంతట తానే రిటైర్మెంట్ను ప్రకటించాడు. -
‘స్లెడ్జింగ్ మొదలు పెట్టగానే విషయం తెలిసింది’
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో భారత జట్టు పోరాటపటిమ, అద్భుత ప్రదర్శన ఎప్పటికీ మరిచిపోలేనిది. ముఖ్యంగా సిడ్నీ టెస్టును అశ్విన్, విహారి కలిసి కాపాడుకున్న తీరు అసమానం. ఈ పర్యటనలో తాను ఆడిన తొలి మూడు టెస్టులకు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, జట్టు ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్‌తో కలిసి పంచుకున్నాడు. మైదానంలో అశ్విన్, విహారి పోరాడుతున్న సమయంలో కోచ్‌లుగా తమ పరిస్థితి ఎలా ఉందో శ్రీధర్ గుర్తు చేసుకున్నాడు. ‘పుజారా అవుటయ్యాక ఆందోళన పెరిగిపోయింది. విహారికి కండరాలు పట్టేయడం కూడా రవిశాస్త్రికి ఆగ్రహం తెప్పించింది. ఒక్క సింగిల్ తీస్తేనే ఇలా జరుగుతుందా అని అతను కోప్పడ్డాడు. ఇక అశ్విన్, విహారి డిఫెన్స్ మొదలయ్యాక ప్రతీ బంతికి అతనిలో ఉత్కంఠ కనిపించింది. ఒక్క బంతి ఆడగానే సీట్లోంచి లేవడం, శభాష్ అంటూ మళ్లీ కూర్చోవడం...ఇలా ఇలా 249 బంతుల పాటు సాగింది. మ్యాచ్ ముగిసేవరకు ఈ భావోద్వేగాలు కొనసాగాయి’ అని శ్రీధర్ చెప్పాడు. అశ్విన్ కూడా విహారితో తన భాగస్వామ్యం గురించి చెప్పుకొచ్చాడు. ‘నేను స్పిన్‌ను సమర్థంగా ఆడతాను కాబట్టి లయన్‌ను ఎదుర్కోవాలని, పేసర్లను విహారి ఆడాలనేది ప్లాన్. అయితే ఒక దశలో సింగిల్ కారణంగా లెక్క మారిపోయింది. కమిన్స్ బౌలింగ్‌లో దెబ్బలు తినకుండా ఆడటం అసాధ్యం. అదే నాకు జరిగింది. మధ్యలో శార్దుల్ ఠాకూర్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి పరుగెత్తుకొచ్చాడు. ఏదో సందేశం ఉందని మేం భావిస్తే... హెడ్ కోచ్ మీకు ఏవేవో సూచనలు ఇవ్వమని నాకు చెప్పి పంపించాడు. అయితే నేను మాత్రం అవేమీ మీకు చెప్పను. మీరు ఎలా ఆడుతున్నారో అలాగే ఆడండి అని చెప్పి వెళ్లిపోయాడు. ఇది చెప్పడానికి నువ్వు రావాలా అన్నాను. ఆసీస్ పేలవ వ్యూహాలు కూడా మాకు మేలు చేశాయి. నేను వంగడం కష్టమై నిటారుగా నిలబడుతుంటే నాకు బౌన్సర్లు వేశారు. అదే ముందుకొచ్చి ఆడేలా చేస్తే నేను బాగా ఇబ్బంది పడేవాడిని. పైన్ స్లెడ్జింగ్ మొదలు పెట్టగానే మమ్మల్ని అవుట్ చేసే విషయంలో వారు చేతులెత్తేశారని మాకు అర్థమైపోయింది’ అని అశ్విన్ వివరించాడు. అడిలైడ్‌లో ఘోర పరాభవం తర్వాత అదే రోజు అర్ధరాత్రి సమావేశంలోనే మెల్బోర్న్ టెస్టు కోసం వ్యూహరచన చేశామని శ్రీధర్ వెల్లడించాడు. 36కు ఆలౌట్ అయిన తర్వాత బ్యాటింగ్‌ను పటిష్టం చేయడంపై దృష్టి పెట్టకుండా అదనపు బౌలర్‌ను తీసుకోవాలనే ఆలోచన బాగా పని చేసిందని, జడేజా అద్భుతంగా ఆడాడని అతను కితాబునిచ్చాడు. పైగా ఆసీస్ బౌలర్లు ఒకే లైన్లో బంతులు వేస్తున్న విషయంపై చర్చించి ఎడమ చేతివాటం ఆటగాడు ఉంటే బాగుంటుందని భావించి పంత్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు చెప్పాడు. జూలైలోనే వ్యూహరచన ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆఫ్‌సైడ్ వైపు ఆడే అవకాశాలు బాగా తగ్గిస్తే తాము పైచేయి సాధించవచ్చనే ప్రణాళికను సిరీస్‌కు చాలా రోజుల ముందుగా వేసినట్లు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ వెల్లడించాడు. సిరీస్‌లో లెగ్ సైడ్ ఆడబోయి కీలక ఆటగాళ్లు స్మిత్, లబ్‌షేన్ వికెట్లు కోల్పోవడంతో భారత్‌కు పట్టు చిక్కింది. ‘స్మిత్, లబ్‌షేన్ ఎక్కువగా కట్, పుల్ షాట్లతో పాటు ఆఫ్ సైడ్ పరుగులు సాధించే బ్యాట్స్‌మెన్. అయితే న్యూజిలాండ్ పేసర్ వాగ్నర్ కొద్ది రోజుల ముందు లెగ్ సైడ్ బౌలింగ్ చేసి స్మిత్‌ను బాగా ఇబ్బంది పెట్టాడు. ఇది చూసి పన్నిన వ్యూహం అద్భుతంగా పని చేసింది’ అని అరుణ్ వివరించారు. ఆస్ట్రేలియా పర్యటనలో లభించిన ఆణిముత్యం సిరాజ్ అని హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించారు. వ్యక్తిగత బాధను దిగమింగి అతను జట్టు కోసం చేసిన ప్రదర్శనను ఎంత ప్రశంసించినా తక్కువేనని అభిప్రాయపడ్డాడు. మరోవైపు ఒక రోజు ఆలస్యంగా శుక్రవారం అశ్విన్, వాషింగ్టన్ సుందర్ స్వస్థలం చెన్నై చేరుకొని రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆరు రోజులు క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. -
‘అతడెవర్నీ మోసం చేయలేదు’
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2019లో ‘మన్కడింగ్’ తీవ్ర వివాదం రేపిన విషయం తెలిసిందే. రాజస్తాన్ రాయల్స్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్‌ను రవిచంద్రన్ అశ్విన్ మన్కడింగ్ విధానం ద్వారా ఔట్ చేశాడు. దీంతో అశ్విన్ క్రీడా స్పూర్తి మరిచాడంటూ ఐపీఎల్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అంతే కాకుండా అతడి వ్యక్తిత్వాన్ని కూడా కించపరుస్తున్నారు. అయితే ఈ వివాదంపై ఇప్పటికే అశ్విన్‌కు మురళీ కార్తీక్, బీసీసీఐ మద్దతు తెలపగా.. తాజాగా అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా అశ్విన్‌కు బాసటగా నిలిచాడు. అశ్విన్ ఎవర్నీ మోసం చేయలేదని.. తన పరిమితులకు లోబడే మన్కడింగ్ చేశాడని, అతడిపై విమర్శలు చేయడం సరికాదని ద్రవిడ్ పేర్కొన్నాడు. అయితే మన్కడింగ్ చేసే ముందు బ్యాట్స్‌మన్‌ను ఒక్కసారైనా హెచ్చరించి ఉండాల్సిందని ఆయన చెప్పుకొచ్చాడు. ఎవరు అంగీకరించినా, అంగీకరించకున్నా అశ్విన్ తన హద్దులకు లోబడే ప్రవర్తించాడని పేర్కొన్నాడు . ఈ చర్యతో అతడి వ్యక్తిత్వానికి అగౌరవపరచడం తగదన్నాడు. ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమని, అదే విధంగా ఇతరుల మనోభావాలను గౌరవిస్తానని ద్రవిడ్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ 67 పరుగులతో ఆ జట్టును గెలుపు దిశగా తీసుకెళ్తున్న వేళ.. అశ్విన్ మన్కడింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. బట్లర్ నిష్ర్కమణ తర్వాత మిగిలిన బ్యాట్స్‌మన్ పెవిలియన్‌కు క్యూ కట్టడంతో పంజాబ్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు విఫలమైంది. ఇక ద్రవిడ్ గతంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. -
టాప్‌టెన్ లో కొనసాగుతున్న పూజారా, అశ్విన్
దుబాయ్: ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాకింగ్ లో భారత ఆటగాళ్లు చటేశ్వర పూజారా, అశ్విన్ లు టాప్ టెన్ లో కొనసాగుతున్నారు. బ్యాటింగ్ విభాగంలో పూజారా ఆరవ స్థానంలో కొనసాగుతుండగా, బౌలింగ్ విభాగంలో అశ్విన్ ఎనిమిదవ ర్యాంక్ లో ఉన్నాడు. కాగా ఈ వీరివురూ ఆటగాళ్లు గత ర్యాంకులను కోల్పోయినా టాప్ టెన్ లో స్థానం దక్కించుకోవడం విశేషం. ఇదిలా ఉండగా టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐదు స్థానాలు దిగజారి 33వ ర్యాంక్ తో సరిపెట్టుకున్నాడు. ఈ సిరీస్ లో పేలవమైన ఆటను కొనసాగిస్తున్న వైస్ కెప్టెన్ కోహ్లి మాత్రం తిరిగి 11 వ స్థానం నిలబెట్టుకున్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో టీం ఇండియా 40 పరుగుల తేడాతో ఓటమి చెందిన విషయం తెలిసిందే.