వీవీఎస్ లక్ష్మణ్
హైదరాబాద్ : బాల్ ట్యాంపరింగ్ ఉదంతం ప్రపంచ క్రికెట్‌ను కలవరపాటుకు గురిచేసింది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటనతో ఆస్ట్రేలియా అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, డెవిడ్ వార్నర్, యువ ఆటగాడు బాన్ క్రాఫ్ట్‌లపై ఆ దేశ క్రికెట్ బోర్డు నిషేదం విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిషేదంతో క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌కు సైతం స్మిత్, వార్నర్‌లు దూరమయ్యారు. వీరి గైర్హాజరితో భారత అభిమానులు చాలా బాధపడ్డారు. ముఖ్యంగా హైదరాబాదీలు వార్నర్ జట్టులో లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అభిమానులే కాదు తన పిల్లులు సైతం కంటతడి పెట్టారని టీమిండియా మాజీ క్రికెటర్, సన్‌రైజర్స్ మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. ప్రముఖ హోస్ట్ గౌరవ్ కపూర్ ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్’ షోలో పాల్గొన్న లక్ష్మణ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
‘వార్నర్ ఈ సీజన్ ఐపీఎల్ ఆడటం లేదనే విషయం తెలుసుకొని నా పిల్లలు సర్వజిత్, అచింత్యాలు చాలా బాధపడ్డారు. వారు వార్నర్‌ను అభిమానిస్తారు. సన్‌రైజర్స్‌కు ఆడటానికి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు వారికి వార్నర్‌తో గట్టి బంధం ఏర్పడింది. అతను జట్టులో ఎంత కీలకమో వారికి తెలుసు. ట్యాంపరింగ్ వివాదాన్ని టీవీల్లో చూసి.. తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమికి కూడా వారు చాలా బాధపడ్డారు.’ అని చెప్పుకొచ్చారు. వార్నర్ స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టు పగ్గాలు చేపట్టి.. ఫైనల్‌కు చేర్చిన విషయం తెలిసిందే. ఇక వార్నర్ 2016 ఐపీఎల్ సీజన్‌లో బ్యాటింగ్‌లో, కెప్టెన్‌గా రాణించి సన్‌రైజర్స్‌కు టైటిల్ అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment