సచిన్ జట్టుపై వార్న్ టీమ్ విజయం
న్యూయార్క్: క్రికెట్ ఆల్ స్టార్స్ సిరిస్ లో భాగంగా జరిగిన తొలి టి20లో సచిన్ బ్లాస్టర్స్ పై వార్న్ వారియర్స్ విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన సచిన్ సేన 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది.
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చెలరేగాడు. 22 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 55 పరుగులు బాదాడు. అయితే మిగతా ఆటగాళ్లు విఫలమవడంతో బ్లాస్టర్స్ భారీ స్కోరు చేయలేకపోయింది. టెండూల్కర్ 26, జయవర్ధనే 18, హూపర్ 11, పొలాక్ 11 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. వీవీఎస్ లక్ష్మణ్ 8 పరుగులు చేశాడు. వార్న్ 3, సైమండ్స్ 3 వికెట్లు పడగొట్టారు. వార్న్ బౌలింగ్ లోనే సచిన్ అవుట్ కావడం విశేషం.
రికీ పాంటింగ్(48), సంగక్కర(41), జాంటీ రోడ్స్(20) రాణిచండంతో వారియర్స్ విజయం సాధించింది. 17.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. 16 బంతులు మిగులుండగానే టార్గెట్ ను చేరుకుంది. బాస్టర్ బౌలర్ షోయబ్ అక్తర్ 2 వికెట్లు పడగొట్టాడు. మురళీ ధరన్ ఒక వికెట్ తీశాడు. షేన్ వార్న్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యారు.