
అపూర్వ్ వాంఖడే
నాగ్‌పూర్: రెస్టాఫ్ ఇండియాతో జరుగుతోన్న ఇరానీ కప్ మ్యాచ్‌లో విదర్భ పటిష్ట స్థితిలో నిలిచింది. మూడో రోజు వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి 5 వికెట్ల నష్టానికి 702 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 588/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. వెటరన్ బ్యాట్స్‌మన్ వసీం జాఫర్ (431 బంతుల్లో 286; 34 ఫోర్లు, 1 సిక్స్) క్రితం రోజు స్కోరుకు కేవలం ఒక్క పరుగు మాత్రమే జతచేసి ట్రిపుల్ సెంచరీకి 14 పరుగుల దూరంలో వెనుదిరిగాడు. మరో ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ అపూర్వ్ వాంఖడే (99 బ్యాటింగ్; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షయ్ వాడ్కర్ (37; 4 ఫోర్లు)తో కలిసి ఐదో వికెట్‌కు 91 పరుగులు జతచేశాడు.
అక్షయ్ అవుటయ్యాక మ్యాచ్‌కు వరణుడు అడ్డుపడటంతో ఆట నిలిచిపోయింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తొలి శతకానికి ఒక్క పరుగు దూరంలో ఉన్న అపూర్వ్‌తో పాటు ఆదిత్య సర్వతే (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రత్యర్థి బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్‌కు 2, అశ్విన్, నదీమ్ జయంత్‌లకు తలా ఓ వికెట్ దక్కింది. మూడో రోజు అశ్విన్ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయకపోవడం గమనార్హం. 28 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైన నేపథ్యంలో నాలుగో రోజు విదర్భ ఎప్పుడు డిక్లేర్ చేస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. మరో రెండు రోజులు ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో విదర్భ డిక్లేర్ చేసిన అనంతరం రెస్టాఫ్ ఇండియాను ఆలౌట్ చేయలేకపోతే... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ప్రకారం కాకుండా ఇన్నింగ్స్ రన్‌రేట్ ప్రకారం విజేతను నిర్ణయిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment