
ఇంకా సరైన కాంబినేషన్ లేదు: కోహ్లి
బెంగళూరు: టీమిండియా క్రికెట్ జట్టులో ఇంకా సరైన కాంబినేషన్ ఏర్పడలేదని టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. అందువల్లే జట్టులో రకరకాల ప్రయోగాలు చేయాల్సి వస్తుందన్నాడు. ఈ క్రమంలోనే ఆటగాళ్లు జట్టు అవసరాలకు తగ్గట్లు ఆడాల్సి వస్తుందన్నాడు. తొలి టెస్టులో అమిత్ మిశ్రా ఆడినా.. తదుపరి రెండో టెస్టుకు ఆడించకపోవడంపై విరాట్ స్పందించాడు.
'పరిస్థితుల్ని బట్టి జట్టును ఎంపిక చేయాల్సి ఉంటుంది. అంతేగానీ ఫలనా వారిని జట్టుకు ఎంపిక చేయాలని మూర్ఖంగా వ్యవహరించం. గత కొన్ని సంవత్సరాల నుంచి అమిత్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఆయా పరిస్థితుల్లో జట్టుకు రవీంద్ర జడేజా, స్టువర్ట్ బిన్నీ అవసరం ఉందని సెలెక్టర్లు భావిస్తే.. ఆ పరిస్థితిని మిశ్రా అర్ధం చేసుకుంటాడు. ఒకేసారి ఇద్దరు ఆల్ రౌండర్లను ఆడించకూడదనే నిబంధన ఏమీ లేదు. ఇంకా జట్టులో సరైన కాంబినేషన్ అంటూ సెట్ కాలేదు. అప్పటి పరిస్థితిని బట్టి ఆటగాళ్లు వారి ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా ఓ రకంగా జట్టుకు ఉపయోగపడుతుంది' అని కోహ్లి పేర్కొన్నాడు.