
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో భారత క్రికెట్ సాధిస్తున్న విజయాల్లో బౌలర్ల పాత్ర కూడా కీలకంగా మారింది. అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లు అమోఘంగా రాణిస్తున్న కారణంగా టీమిండియా స్వదేశంలో తిరుగులేని విజయాల్ని సాధిస్తూ వరుస సిరీస్‌లను సొంతం చేసుకుంటుంది. ఈ క‍్రమంలోనే త్వరలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లబోతున్న టీమిండియాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మన బ్యాటింగ్ బలానికి బౌలింగ్ కూడా తోడైతే సఫారీలను వారి గడ్డపై బోల్తా కొట్టించడం కష్టమేమీ కాదు. దాదాపు ఇదే అభిప్రాయాన్ని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సైతం వ్యక్తం చేసినప్పటికీ, సఫారీలను వారి దేశంలో ఓడించాలంటే తీవ్రంగా శ్రమించకతప్పదన్నాడు.
దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు సులువుగా విజయాలు సాధించడం చాలా కష్టమన్నాడు. దక్షిణాఫ్రికాపై పైచేయి సాధించాలంటే తొలుత స్కోరు బోర్డుపై భారీ పరుగుల్ని ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు. అది మన పేసర్లు తమదైన శైలిలో చెలరేగడానికి దోహదం చేస్తుందని గంగూలీ అభిప్రాయపడ్డాడు. మనది అత్యుత్తమ బౌలింగ్ ఎటాక్ అనడంలో ఎటువంటి సందేహం లేకపోయినా, దక్షిణాఫ్రికాతో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నాడు. మన బౌలింగ్ సత్తా ఏమిటో సఫారీ పిచ్‌లపై చూద్దామని ఒక ప్రశ్నకు సమాధానంగా గంగూలీ చెప్పాడు.
ఇదిలా ఉంచితే, శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో తీవ్రంగా నిరాశపరిచిన అజింక్యా రహానే ఫామ్‌పై తనకు ఎటువంటి ఆందోళన లేదన్నాడు. నాణ్యమైన క్రికెటర్లలో ఒకడైన రహానే.. సఫారీ పిచ్‌లపై రాణించడం ఖాయమన‍్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత జట్టులో విరాట్ కోహ్లి, చతేశ్వర పుజరా, రహానే, మురళీ విజయ్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారని, వారు తిరిగి అత్యుత్తమ ఆటగాళ్లగానే భారత్‌కు వస్తారని గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment