పాక్ కు ఝలక్ ఇచ్చిన వెస్టిండీస్!
కరాచీ:దాదాపు ఏడేళ్లుగా పాకిస్తాన్‌లో క్రికెట్ మ్యాచ్‌లు ఆడేందుకు పెద్ద జట్లను ఒప్పించడంలో విఫలమైన పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి మరోసారి నిరాశే ఎదురైంది. పాకిస్తాన్ లో వెస్టిండీస్ క్రికెట్ జట్టు పర్యటనపై ఎన్నో ఆశలను పెట్టుకున్న పీసీబీకి చుక్కెదురైంది. భద్రతాపరంగా కొన్ని అనుమానాలను వ్యక్తం చేసిన విండీస్ బోర్డు.. తమ దేశంలో పర్యటించాలన్న పాక్ క్రికెట్ పెద్దల విన్నపాన్ని తోసిపుచ్చింది. పాకిస్తాన్ లో విండీస్ క్రికెట్ జట్టు పర్యటించడానికి ఆసక్తి చూపలేదన్న విషయాన్ని సోమవారం సీనియర్ అధికారి స్సష్టం చేశారు.
ఇరు జట్ల మధ్య వచ్చే సెప్టెంబర్‌లో యూఏఈలో రెండు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఇందులో కొన్ని మ్యాచ్‌లను పాకిస్తాన్‌లోనే ఆడితే బాగుంటుందని విండీస్‌కు పాక్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పీసీబీ, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మధ్య పలు దఫాలుగా చర్చలు కూడా జరిగినా అవి సఫలం కాలేదు. 2009లో శ్రీలంక జట్టుపై తీవ్రవాదుల దాడి తర్వాత ఆ దేశంలో మరే పెద్ద జట్టు అడుగు పెట్టలేదు.