లాహోర్: సొంత గడ్డపై పెద్ద జట్టుతో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించి అంతర్జాతీయంగా పరువు దక్కించుకుందామనుకున్న పాకిస్థాన్‌కు మరో షాక్ తగిలింది! పాకిస్థాన్‌లో టీ20 సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్ జట్టు నో చెప్పింది. విండీస్.. పాక్ పర్యటనకు రావడంలేదన్న విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ షహర్యార్ ఖాన్ శనివారం మీడియాకు వెల్లడించారు. భద్రతాపరమైన కారణాలల వల్లే విండీస్ ప్లేయర్లు పాక్‌లో పర్యటించేందుకు విముఖత చూపారని ఖాన్ తెలిపారు.
పాక్-విండీస్‌ల మధ్య రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను నిర్వహించాలని పీసీబీ చాలా రోజులుగా ప్రయత్నిస్తోంది. ఒక దశలో విండీస్ క్రికెట్ బోర్డుకూడా సిరీస్‌కు సై అంది. అయితే విండీస్ ఆటగాళ్ల సంఘం మాత్రం పాక్‌లో మ్యాచ్‌లు ఆడబోమని బోర్డుకు తేల్చిచెప్పారు. దీంతో విండీస్‌బోర్డు పాక్‌కు తన నిస్సహాయతను తెలిపింది. ఇక చేసేదేమీలేక ‘పర్యటన ఉండదు’అని పీసీబీ చీఫ్ ప్రకటించారు. 2009లో శ్రీలంక క్రికెటర్లపై లాహోర్‌లో ఉగ్రదాడి జరిగిన నాటి నుంచి విదేశీ జట్లు పాక్ పర్యటనకు వెళ్లడంలేదు. కాగా, చిన్నజట్టైన జింబాబ్వే మాత్రం గత ఏడాది పాక్‌గడ్డపై మూడు వన్‌డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడింది. అదే ఊపులో విండీస్ లాంటి పెద్ద జట్లుతో మ్యాచ్‌లు నిర్వహించాలని ఆశించి, భంగపడింది.
ఇదిలాఉంటే, శ్రీలంకపై దాడి జరిగిన లాహోర్‌లోనే.. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) ఫైనల్ మ్యాచ్(మార్చి 8న) నిర్వహించాలని, తద్వారా అంతర్జాతీయంగా క్రికెట్ జట్లలో నెలకొన్న ‘పాక్ భయాన్ని’ పోగొట్టాలని పీసీబీ భావిస్తోంది. జనవరి 28 నుంచి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ గిలెస్ క్లార్క్ పాక్‌లోని క్రికెట్ స్టేడియంలను సందర్శించనున్నారని, భద్రతా ప్రమాణాలపై ఆయన వెల్లడించే అభిప్రాయం తమకు ఎంతగానో లాభిస్తుందని పీసీబీ చీఫ్ ఖాన్ అన్నారు.
పాక్ ఆశలపై నీళ్లు..
Published Sun, Jan 15 2017 9:55 AM | Last Updated on Tue, Sep 5 2017 1:17 AM
Advertisement