
టీ 20 ప్రపంచ కప్:పాకిస్తాన్ అవుట్..వెస్టిండీస్ ఇన్
మిర్పూర్: ట్వంటీ 20 వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ నిష్క్రమించింది. ఈ రోజు ఇక్కడ వెస్టిండీస్ తో జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఘోరంగా ఓడి టోర్నీ నుంచి వైదొలిగింది. విండీస్ విసిరిన 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన పాకిస్తాన్ కు ఆదిలోనే చుక్కెదురైంది. ఓపెనర్లు అహ్మద్ షెహ్ జాద్, కమ్రాన్ అక్మల్ లు పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగి పాక్ కు షాకిచ్చారు. దీంతో ఇక తేరుకోలేని పాకిస్తాన్ వరుస వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. సెమీస్ కు చేరాలంటే ఈ మ్యాచ్ లో చావు రేవో తేల్చుకోవాల్సిన తరుణంలో పాకిస్తాన్ అందుకు తగ్గట్టు ఆడలేదు. మహ్మద్ హఫీజ్(19), షోయబ్ మక్ సూద్ (18), షాహిద్ ఆఫ్రిది(18), తన్వీర్(14) పరుగుల మినహా ఏ ఒక్క ఆటగాడు నిలకడగా ఆడకపోవటంతో పాకిస్తాన్ 17.5 ఓవర్లలో 82 పరుగులు మాత్రమే చేసి ఓటమి చెందింది. పాకిస్తాన్ ఆటగాళ్లలో ఏడుగురు సింగిల్ డిజిట్ కే పరిమితమవడం గమానార్హం.
విండీస్ బౌలర్లలో బద్రీ, నరైన్ లకు తలో మూడు వికెట్లు లభించగా, రసూల్, సంతోకీలక చెరో రెండు వికెట్లు తీసి గెలుపులో కీలక పాత్ర పోషించారు. డిఫెండింగ్ చాంఫియన్ హోదాలో బరిలోకి దిగిన వెస్టిండీస్ అన్ని విభాగాల్లోనూ ఆకట్టుకుని శ్రీలంకతో సెమీఫైనల్ పోరుకు సిద్దమైంది. టాస్ గెలిచిన విండీస్ తొలుత బ్యాటింగ్ దిగింది. ఓపెనర్లు క్రిస్ గేల్ (5), స్మిత్ (8)పరుగులు చేసి ఆదిలోనే పెవిలియన్ బాట పట్టినా, సిమ్మన్స్(31), శ్యామ్యూల్స్(20) పరుగులు చేసి స్కోరును ముందుకు నడిపించారు.అనంతర్ బ్రేవో (46), సామీ(42*) మరోమారు ఆకట్టుకోవడంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. గత మ్యాచ్ లో ఆస్ట్రేలియా కు కంగుతినిపించిన విండీస్ అదే స్థాయిలో ఆడి సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది.