సిడ్నీ: బాల్ ట్యాంపరింగ్ ఘటనలో తాను ఎంతగానో చింతిస్తున్నానని, అందుకు క్షమించాలని ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ క్రికెట్ ప్రపంచానికి విజ్ఞప్తి చేశాడు. తాను ఎంతో ప్రేమించే క్రికెట్‌పై తన చర్య మాయని మచ్చగా అభివర్ణించాడు. తామ చేసిన తప్పిదాలు క్రికెట్ ప్రతిష్ఠను దెబ్బతీశాయని వార్నర్ అంగీకరించాడు.
అయితే ప్రస్తుతం వార్నర్ సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అతనిపై ఏడాది నిషేధం విధించడంతో పాటు శాశ్వతంగా ఆసీస్ పగ్గాలు చేపట్టకుండా సీఏ(క్రికెట్ ఆస్ట్రేలియా) నిర్ణయం తీసుకుంది. స్మిత్‌పై ఏడాది నిషేధం మాత్రమే విధించిన సీఏ.. వార్నర్‌పై మాత్రం కాస్త కఠినంగా వ్యవహరించిందనే చెప్పాలి. ఒకే వ్యవహారంలో ఒకే దేశానికి చెందిన ఆటగాళ్లపై వేర్వేరుగా ఆ దేశ క్రికెట్ బోర్డు ఎందుకిలా నిర‍్ణయం తీసుకుందో సగటు అభిమానికి ఓ పజిల్‌లా మారిపోయింది. ఈ ఘటనలో తన పాత్ర ఉందంటూ కెప్టెన్ స్మిత్ అంగీకరించినప్పటికీ, వైస్ కెప్టెన్ వార్నర్‌నే టార్గెట్ చేసినట్లు కనబడింది. స్మిత్‌కు ఏడాది పాటు కెప్టెన్సీకి దూరం పెడతామని చెప్పిన సీఏ.. వార్నర్‌ను శాశ్వతంగా సారథ్య బాధ్యతలకు చేపట్టుకుండా ఉండేలా నిర్ణయం తీసుకుంది.
ఇందుకు కారణాలు లేకపోలేదు. గతంలో ఆసీస్ క్రికెటర్ల కాంట్రాక్ట్‌లో భాగంగా జీతాల విషయంలో సీఏతో తీవ్రంగా పోరాడటమే వార్నర్‌కు శాపంగా మారినట్లు కనబడుతోంది. ఆటగాళ్లందర్నీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి సీఏను దిగివచ్చేలా చేశాడు వార్నర్. ఆసీస్ పగ్గాలను భవిష్యత‍్తులో వార్నర్ చేపట్టకుండా సీఏ నిర్ణయం తీసుకోవడం వెనుక ఇదే ప్రధాన కారణమనేది క్రికెట్ ప్రేమికుల భావన.
వార్నర్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటి?
మరి త్వరలోనే ఒక న్యూస్ చెబుతానంటూ సఫారీ పర్యటన నుంచి సిడ్నీకి పయనమయ్యే క్రమంలో వార్నర్ వ్యాఖ్యానించడం వెనుక ఆంతర్యం ఏమిటి. తనపై నిషేధం తగ్గుతుందని వార్నర్ భావిస్తున్నాడా?, లేక భవిష్యత్తులో ఆసీస్ పగ్గాలు చేపట్టకుండా సీఏ తీసుకున్న ముందస్తు నిర్ణయాన్ని తిరిగి సమీక్షిస్తారని నమ్ముతున్నాడా?, మొత్తం క్రికెట్‌కు గుడ్ బై చెప్పి అదే వార్తగా చెప్పాలనుకుంటున్నాడా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు.
మద్దతు లభిస్తుందా..?
ట్యాంపరింగ్ ఉదంతం తర్వాత స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్ క్రాఫ్ట్, కోచ్ లీమన్ వ్యాఖ్యల కంటే కూడా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చేసిన వ్యాఖ్యలే అత్యధిక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. స్మిత్, వార్నర్‌లపై ఏడాది నిషేధం విధించడంతో పాటు బాన్ క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విధించింది. మరొకవైపు వారికి వారం రోజుల్లో అప్పీలు చేసుకునే అవకాశం కూడా ఇచ్చింది. దీనిలో భాగంగా అభిమానులు, ప‍్రజలు, క్రికెటర్ల మద్దతును కూడా పరిగణలోకి తీసుకుంటామని సీఏ స్పష్టం చేసింది. ఒకవేళ వీరికి మద్దతు లభిస్తే నిషేధం తగ్గించే ఆలోచన చేస్తుందా..? అదే సమయంలో స్మిత్, వార్నర్‌ల 'కెప్టెన్సీ'పై తీసుకున్న నిర్ణయాన్ని కూడా సమీక్షిస్తుందా? అనేది త్వరలో తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment