
ధోనిని అనుకరించాడు!
న్యూఢిల్లీ:గతేడాది అక్టోబర్లో మహేంద్ర సింగ్ ధోని చేసిన రనౌట్ మ్యాజిక్ అందరికీ గుర్తుండే ఉంటుంది. న్యూజిలాండ్తో సిరీస్ లో రాంచీలో జరిగిన నాల్గో వన్డేలో ఆ దేశ స్టార్ ఆటగాడు రాస్ టేలర్ను ధోని చేసిన రనౌట్ మ్యాచ్కే హైలెట్ అయ్యింది. ఫీల్డర్ నుంచి బంతిని అందుకున్న ధోని.. వికెట్ల వైపు చూడకుండానే బంతిని విసిరి టేలర్ను అవుట్ చేశాడు. ఉమేశ్ వేసిన ఇన్నింగ్స్ 46వ ఓవర్లో ఫైన్‌లెగ్ దిశగా ఆడిన టేలర్ వేగంగా సింగిల్ పూర్తి చేసుకొని రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. ఈ సమయంలో ధావల్ విసిరిన త్రో కోసం ధోని ముందుకు దూసుకొచ్చాడు. బౌన్స్ అయి వచ్చిన బంతిని అందుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండానే అదే వేగంతో రెప్పపాటులో వికెట్లపైకి విసిరేశాడు ధోనీ. ఆ బంతి వికెట్లకు తగలడం టేలర్ రనౌట్ కావడం చకచకా జరిగిపోయాయి.
అయితే అదే తరహా అవుట్ కోసం ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ తాజాగా యత్నించినా సక్సెస్ అయితే కాలేదు. పురుషుల బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో శనివారం జరిగిన మ్యాచ్లో ప్రత్యర్థి జట్టు ఆటగాడ్ని రనౌట్ చేయడానికి ధోని తరహాలోనే హాడిన్ ప్రయత్నించాడు. అయితే ఆ బంతి వికెట్లను తగిలే సరికి బ్యాట్స్ మన్ క్రీజ్లోకి వచ్చేశాడు. దీనిపై బీబీఎల్ ఒక వీడియోను పోస్ట్ చేసింది. వికెట్ల వెనుక నుంచి గతంలో ఎంఎస్ ధోని చేసిన మ్యాజిక్ను హాడిన్ టచ్ చేసే యత్నం చేశాడని బీబీఎల్ తన ట్వీట్లో పేర్కొంది.