సచిన్ టెండూల్కర్ ఆఖరి రెండు టెస్టులు ఆడటం ద్వారా చరిత్రలో భాగం కాబోయే దృష్టవంతులెవరు..? ఈ ప్రశ్నకు సమాధానం నేడు తెలుస్తుంది.
ముంబై: సచిన్ టెండూల్కర్ ఆఖరి రెండు టెస్టులు ఆడటం ద్వారా చరిత్రలో భాగం కాబోయే దృష్టవంతులెవరు..? ఈ ప్రశ్నకు సమాధానం నేడు తెలుస్తుంది. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేసేందుకు సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ గురువారం సమావేశం కానుంది. సచిన్ చివరి సిరీస్ కావడంతో ఇప్పటికే ఈ మ్యాచ్‌లకు ప్రాధాన్యత పెరిగింది.
దీనికి తోడు దక్షిణాఫ్రికా పర్యటనను కూడా దృష్టిలో ఉంచుకుని సెలక్టర్లు జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేస్తే 8 మంది బ్యాట్స్‌మెన్ ఉంటారు. ధోని, కోహ్లి, సచిన్, ధావన్, పుజారా... ఈ ఐదుగురూ జట్టులో ఉండటం ఖాయం. మిగిలిన మూడు స్లాట్‌ల కోసం రోహిత్, గంభీర్, విజయ్, రైనా, యువరాజ్, రహానే రేసులో ఉన్నారు. ఆల్‌రౌండర్ కమ్ స్పిన్నర్‌గా జడేజా స్థానం కూడా పదిలమే.
ముగ్గురు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లు జట్టులో ఉంటారనుకుంటే... పేస్ విభాగంలో జహీర్ పునరాగమనం దాదాపుగా ఖాయంగానే కనిపిస్తోంది. భువనేశ్వర్, ఇషాంత్, ఉమేశ్ యాదవ్, షమీ మిగిలిన రెండు స్థానాల కోసం పోటీ పడుతున్నారు. ఇక స్పిన్ విభాగంలో అశ్విన్, హర్భజన్, మిశ్రా, ఓజాలలో ముగ్గురు ఎంపికయ్యే అవకాశం ఉంది. ఏమైనా మిగిలిన సిరీస్‌లతో పోలిస్తే ఈసారి జట్టు ఎంపికపై ఆసక్తి ఎక్కువగా ఉంది.