
అందరివాడికే అందలం
► భారత క్రికెట్ ప్రధాన కోచ్‌గా అనిల్ కుంబ్లే
► స్పిన్ దిగ్గజానికే ఓటేసిన బీసీసీఐ పదవీకాలం ఏడాది
అనూహ్యం ఏమీ జరగలేదు... భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి అందరి అంచనాల ప్రకారమే అర్హుడైన వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చింది. టి20 ప్రపంచ కప్ ముగిసిన నాటినుంచి కొనసాగుతున్న సందిగ్ధతకు ముగింపు పలుకుతూ మాజీ కెప్టెన్, దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేను బీసీసీఐ కోచ్‌గా నియమించింది. పారదర్శకత కోసం దరఖాస్తులు, ఇంటర్వ్యూలు అంటూ బోర్డు హడావిడి చేసినా... కుంబ్లే అడుగు పెట్టడంతోనే ఈ ప్రక్రియ లాంఛనమేనని అర్థమైంది. ఇప్పుడు దానికి అధికారిక ముద్ర పడింది. ఆటగాడిగా గుగ్లీలు, ఫ్లిప్పర్లతో ప్రత్యర్థుల పని పట్టిన ఇంజినీరింగ్ మేధావి ఇప్పుడు శిక్షకుడిగా తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు.
ధర్మశాల: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా 46 ఏళ్ల అనిల్ కుంబ్లేను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ప్రాథమికంగా కోచ్ పదవి కోసం అందిన 57 దరఖాస్తులను వడబోసి, ఆ తర్వాత అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూ, సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ గురువారం వెల్లడించారు. కుంబ్లేను ప్రస్తుతం ఏడాది కాలానికే నియమించారు. వచ్చే నెలలో జరగనున్న వెస్టిండీస్ పర్యటనతో ఆయన బాధ్యతలు చేపడతారు. సచిన్, గంగూలీ, లక్ష్మణ్ సభ్యులుగా ఉన్న అడ్వైజరీ కమిటీ ముందు కుంబ్లే మంగళవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఆయనతో పాటు మరో మాజీ ఆటగాడు రవిశాస్త్రి చివరి వరకు రేసులో నిలిచినా... స్పిన్ దిగ్గజంవైపే బోర్డు మొగ్గు చూపింది. కోచ్‌గా ఎలాంటి గతానుభవం, సర్టిఫికెట్లు లేకపోయినా 18 ఏళ్ల కెరీర్‌లో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన రికార్డే కుంబ్లేకు అండగా నిలిచింది. మరో వైపు అసిస్టెంట్ కోచ్‌లు, సహాయక సిబ్బందిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే వారినీ ఎంపిక చేస్తామని బోర్డు ప్రకటించింది.
సమర్థుడు కాబట్టే: భారత కోచ్ ఎంపికలో తాము పారదర్శకంగా వ్యవహరించామని, అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే కుంబ్లేపై నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. ‘కోచ్ ఎంపిక కోసం మేం కొన్ని నిబంధనలు విధించాం. అడ్వైజరీ కమిటీని కూడా ఇందులో భాగం చేశాం. ఈ ప్రక్రియలో అన్ని అంశాలు పరిశీలించి, ఇంటర్వ్యూల తర్వాత కుంబ్లేనే సరైన వ్యక్తిగా మేం భావించాం. కోచ్ స్వదేశీయా, విదేశీయా అన్నది కాదు. సమర్థుడైతే చాలు. అది జట్టుకు మేలు చేస్తుంది’ అని ఆయన చెప్పారు. రవిశాస్త్రి పనితీరుపై కూడా తాము సంతృప్తిగానే ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
మరో వైపు క్రికెట్ టెక్నాలజీ, ప్లేయర్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి కంపెనీని కుంబ్లే నిర్వహిస్తుండటం వల్ల ఎలాంటి ఇబ్బందీ లేదని బోర్డు కార్యదర్శి అజయ్ షిర్కే అన్నారు. ‘కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ అనేది ఇక్కడ కుంబ్లేకు వర్తించదు. ఎంపికకు ముందు ఆ అంశంపై కూడా చర్చించాం. దానిపై ఎలాంటి సమస్యా లేదు. బోర్డులో అన్ని అంశాల్లో ప్రొఫెషనలిజం తీసుకు వస్తున్నాం కాబట్టి అదే తరహాలో ఏడాది కాలానికే అవకాశమిచ్చాం’ అని షిర్కే పేర్కొన్నారు.
► భారత్ తరఫున టెస్టులు, వన్డేలు కలిపి అత్యధిక వికెట్లు (956) తీసిన ఘనత కుంబ్లే సొంతం
ఎలాంటి సవాలుకైనా సిద్ధం: కుంబ్లే
కోచ్ పదవి చాలా పెద్ద బాధ్యత. ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. కోచ్ పాత్ర తెరవెనుక ఉంటుంది. ఆటగాళ్లు మాత్రమే ముందు కనిపిస్తారు. ఈ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా. భిన్నమైన పాత్రలో భారత్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి తిరిగి రావడం నాకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఏ వ్యూహమైనా గెలవడానికే. దీని గురించి ఆలోచించడానికి ఇంకాస్త సమయం ఉంది. విండీస్‌తో రాబోయే సిరీస్‌కు నా వద్ద స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ఆటగాళ్లను కూడా భాగస్వాములుగా చేయాలనుకుంటున్నా. భారత క్రికెట్‌కు ఇదో గొప్ప సమయం. సచిన్, సౌరవ్, లక్ష్మణ్, ద్రవిడ్‌లతో చాలాకాలం కలిసి ఆడా. మైదానం లోపల, బయట వీళ్లతో మంచి అనుబంధం ఉంది. భారత క్రికెట్‌కు మంచి చేసేందుకు ఈ నలుగురితో కూర్చొని చర్చించాల్సిన అవసరం ఉంది. కోచ్ పదవి గురించి కుటుంబంతోనూ మాట్లాడా. బాగా మద్దతిచ్చారు. అన్నీ ఇచ్చిన క్రికెట్‌కు ఎంతో కొంత తిరిగి ఇవ్వడానికి ఇదే సరైన సమయం.
‘భారత క్రికెట్‌కు మంచి రోజులు రాబోతున్నాయి. చీఫ్ కోచ్‌గా అనిల్ జట్టులో అంకితభావం, అనుభవం, నైపుణ్యతను తీసుకొస్తాడని భావిస్తున్నా. ఇందుకు ఏడాది కాలం సరిపోతుంది. కుంబ్లే ఆటగాళ్లతో కలిసిపోవాలి. అప్పుడే అతని నుంచి వాళ్లు ఎంతో కొంత నేర్చుకుంటారు. తన అభిప్రాయాలను కూడా కచ్చితంగా వెల్లడించాలి.’ - గావస్కర్
‘కుంబ్లేను మళ్లీ మిస్ కాబోతున్నాం. అయినప్పటికీ సంతోషంగానే ఉంది. భారత క్రికెట్‌కు ఇంతకంటే నమ్మకమైన కోచ్ దొరకడు.’ -కుంబ్లే భార్య చేతన