క్రిస్ గేల్కు ఏమైంది?
ప్రపంచ క్రికెట్ లో క్రిస్ గేల్ ఒక సముచిత క్రికెటరే కాదు.. విధ్వంసకర ఆటగాడు కూడా. ఆది నుంచి ప్రత్యర్థి బౌలర్ పై పైచేయి సాధించే అరుదైన ఆటగాళ్లలో గేల్ ఒకడు. ప్రస్తుత వెస్టిండీస్ క్రికెట్ లో స్టార్ ఆటగాడు ఎవరైనా ఉంటే అది గేల్ మాత్రమేనని కచ్చితంగా చెప్పొచ్చు. పిచ్ లోకి అడుగుపెట్టాడంటే ఎడాపెడా బంతుల్ని బౌండరీలకు దాటించడం గేల్ కు తెలిసిన విద్య. సునామీ, విధ్వంసకరం, సుడిగాలి.. ఈ తరహా ఆటకు చిరునామా గేల్ అంటే అతిశయోక్తి కాదు. అంతర్జాతీయ మ్యాచ్ అయినా, దేశవాళీ లీగ్ అయినా గేల్ బ్యాట్ కు పదునెక్కువ.
ట్వంటీ 20 క్రికెట్లో ఇప్పటివరకూ ఏడు సెంచరీలు సాధించిన గేల్.. ఈ ఫార్మాట్ లో తొలి సెంచరీ సాధించిన ఘనతనూ సొంతం చేసుకున్నాడు. మరోవైపు 2013 ఐపీఎల్ సీజన్ లో 30 బంతుల్లో ఫాస్టెస్ సెంచరీ చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకున్న గేల్.. ఐపీఎల్ చరిత్రలో నాలుగు సెంచరీలు సాధించడం విశేషం. గత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయాల్లో గేల్ పాత్ర వెలకట్టలేనిది.
మరి అటువంటి గేల్కు ఐపీఎల్-9వ సీజన్ లో ఏమైందనేది అసలు ప్రశ్న. అతని పరుగుల తుపాన్ కు బ్రేక్ పడినట్లు కనబడుతోంది. ఇప్పటివరకూ ఈ ఐపీఎల్ సీజన్ లో ఐదు మ్యాచ్లాడిన గేల్ మొత్తంగా 19 పరుగులు చేయడమే ఇందుకు నిదర్శనం. ఈ ఐపీఎల్లో 1, 0, 7, 5, 6 గేల్ వ్యక్తిగత స్కోర్లు. ఇందులో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 7 కాగా, అతని ఖాతాలో రెండు ఫోర్లు, 1 సిక్స్ మాత్రమే ఉండటం గమనార్హం.