భారత్, విండీస్ ఎలెవన్ మ్యాచ్ డ్రా
సెయింట్ కిట్స్: విండీస్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరిగిన మూడు రోజుల మ్యాచ్ డ్రా అయింది. భారత బౌలర్లు మెరుగ్గా రాణించడంతో తొలి ఇన్నింగ్స్ లో విండీస్ జట్టు కేవలం 180 పరుగులకే చాపచుట్టేసింది. రెండో ఇన్నింగ్స్ లో 86 ఓవర్లు ఆడిన విండీస్ ఆరు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. మూడు రోజుల మ్యాచ్‌లో భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 105.4 ఓవర్లలో 364 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో రెండు వందల పరుగులలోపే ఆలౌటయిన విండీస్ రెండో ఇన్నింగ్స్ లో చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. మూడోరోజు నిర్ణీత సమయం ముగిసిపోవడంతో అంపైర్లు మ్యాచ్ డ్రాగా ప్రకటించారు.
ఓ దశలో 70 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన విండీస్ ను బ్లాక్‌వుడ్ (121 బంతుల్లో 35 బ్యాటింగ్; 5 ఫోర్లు), విశాల్ సింగ్ (101 బంతుల్లో 39;5 ఫోర్లు 1 సిక్స్) ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 62 పరుగులు జత చేశారు. కార్న్‌వాల్ బ్యాటింగ్ లోనూ రాణించి 21 పరుగులు చేశాడు. హాడ్జ్ (39) కూడా ఆకట్టుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ 3 వికెట్లు పడగొట్టగా, షమీ, జడేజా చెరో వికెట్ తీశారు.
రాణించిన జడేజా
బౌలింగ్‌లో మూడు వికెట్లతో చెలరేగిన రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు. తొమ్మిదో నంబర్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగిన తను (61 బంతుల్లో 56; 8 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించడంతో... విండీస్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల మ్యాచ్‌లో భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 105.4 ఓవర్లలో 364 పరుగులు చేసింది. దీంతో 184 పరుగుల ఆధిక్యం లభించింది. జడేజా.. వృద్ధిమాన్ సాహాతో కలిసి ఎనిమిదో వికెట్‌కు 44 పరుగులు, తొమ్మిదో వికెట్‌కు అశ్విన్ (61 బంతుల్లో 26; 4 ఫోర్లు)తో కలిసి 47 పరుగులు జోడించాడు. విండీస్ బౌలర్లలో కార్న్‌వాల్‌కు ఐదు వికెట్లు దక్కాయి. భారత్, విండీస్ ల మధ్య తొలి టెస్టు 21న ప్రారంభం కానుంది.