
సమం చేస్తారా?చాప చుట్టేస్తారా?
లండన్: క్రికెట్ పుట్టింట్లో ధోని సేన కొత్త చరిత్ర.. లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్‌పై 95 పరుగుల విజయం..విఖ్యాత లార్డ్స్ మైదానం 200 ఏళ్లు పూర్తి చేసుకున్నవేళ.. 28ఏళ్ల అనంతరం భారత జట్టు రికార్డు. ఇది గత మూడు వారాల క్రితం మాట. ఆ లార్డ్స్ విజయంతో భారత జట్టు టెస్ట్ సిరీస్ ను గెలుచుకుంటుందని అంతా భావించారు. కాగా, ఆ టెస్టు మ్యాచ్ అనంతరం జరిగిన రెండు వరుస టెస్టుల్లో ఓటమి పాలైన భారత్.. ఆధిక్యాన్ని ఇంగ్లండ్ చేతుల్లో పెట్టింది. ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టులో 266 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో చిత్తయింది. 445 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 178 పరుగులకే ఆలౌటై ఇంగ్లండ్ ను సిరీస్ ను సమం చేయడానికి అవకాశం ఇచ్చింది. అదేదో యాధృచ్చింగా జరిగిపోయిందని భావించిన సగటు భారత్ అభిమానికి మాత్రం నాల్గో టెస్టు కూడా తీవ్ర నిరాశను మిగిల్చింది. ఏకంగా ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయి తీవ్ర విమర్శల పాలైంది.
ఇంకా భారత్ కు చివరి టెస్టు రూపంలో ఆశలు మిగిలే ఉన్నాయి. ఆగస్టు 15 వ తేదీన ఓవల్ లో జరుగనున్న ఐదో టెస్టుకు భారత్ సన్నద్ధం అవుతోంది. ఆ టెస్ట్ మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను సమం చేయడానికి భారత్ తీవ్రంగా పోరాడాల్సి ఉంది. అదే సమయంలో ఇంగ్లండ్ కూడా మంచి ఊపు మీద కనబడుతోంది. కనీసం భారత్ తో మ్యాచ్ గెలవకపోయినా.. సిరీస్ ను మాత్రం వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరనేది సత్యం. అసలు అంతకుముందు జరిగిన రెండు టెస్టుల్లో భారత్ విఫలమైన తీరు మాత్రం విమర్శలకు తావిస్తోంది. ఆ రెండు టెస్టుల్లో కనీసం పోరాడకుండానే భారత జట్టు ఓటమి పాలై అపఖ్యాతిని మూటగట్టుకుంది. విదేశాల్లో గత భారత జట్టు చరిత్రను చూస్తే మాత్రం మనకు ఎక్కువ గుర్తుకు వచ్చే వ్యక్తులు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ లు. వీరు విఫలమైయ్యారంటే మాత్రం భారత జట్టు ఓటమి పాలైన సందర్భాలే మెండు. వీరు సమష్టిగా విఫలమైన చోట భారత జట్టు ఫలితం కూడా ప్రతికూలంగా వచ్చిందని చరిత్ర చెబుతోంది.ఇప్పుడు టీం ఇండియా పరిస్థితి కూడా ఇలానే ఉంది.
2011లో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో విరాట్ కోహ్లి, చటేశ్వర పూజారాలు లేరు. తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తొలిసారి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లారు. దాంతో వీరిపై అంచనాలు పెరిగాయి. ఈ ఇద్దరు యువ ఆటగాళ్ల ప్రదర్శనపైనే భారత్ విజయావకాశాలు ఉన్నాయని క్రికెట్ నిపుణులు కూడా విశ్లేషించారు. ఇప్పుడు అదే సరిగ్గా ప్రతికూలంగా జరిగింది. వీరిద్దరి వైఫల్యంతో భారత జట్టు వరుస రెండు టెస్టుల్లో ఘోర పరాభావాన్ని మూట గట్టుకుంది. టెస్టుల్లో మూడు, నాలుగు స్థానాల్లో ఆడిన ఆటగాళ్లు విఫలమైతే మాత్రం అది జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
గత 16 ఇన్నింగ్స్ లలో ఈ ఇద్దరు కలిసి మధ్య 315 పరుగులు మాత్రమే నమోదయ్యాయంటే ఆశ్చర్యం కలుగుతుంది.అలాంటప్పుడు వీరు నాటి దిగ్గజాల స్థానాలను భర్తీ చేయగలరంటే అతిశయోక్తే అవుతుంది.సచిన్ తన తొలి ఇంగ్లండ్ పర్యటనలో 61.25 సగటుతో ఐదు ఇన్నింగ్స్ లలో 245 పరుగులు చేయగా, ద్రవిడ్ తొలి మూడు ఇన్నింగ్స్ లలో 62.33 సగటుతో 187 పరుగులు సాధించాడు. మరీ వారి స్ఫూర్తిని తీసుకుని ఈ ఇద్దరు భారత్ చివరి టెస్టులో రాణిస్తారా?లేక పాత కథే పునరావృతం చేస్తారో వేచి చూడాల్సిందే.