
ముంబై: తన క్రీడా పయనం కొనసాగుతుందని... మధ్యలో వచ్చింది విరామమేనని అంటోంది భారత షూటర్ తేజస్విని సావంత్. గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో స్వర్ణం గెలిచిన తేజస్విని... ఈ క్రీడల్లో కొత్త రికార్డు కూడా నెలకొల్పింది. దీంతోపాటు మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్‌లో రజతం నెగ్గింది. అయితే, 2014 కామన్వెల్త్, అనంతరం ఇతర అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనలేకపోయిన ఆమె కెరీర్‌లో కొంత వెనుకబడింది.
దీంతో గోల్ట్‌కోస్ట్ విజయాన్ని విశ్లేషకులు తేజస్వినికి ‘కమ్ బ్యాక్’గా పేర్కొంటున్నారు. కానీ, కుటుంబ కారణాలరీత్యా రెండు నెలలు విరామం తీసుకోవడంతో 2014 కామన్వెల్త్ పోటీలకు అర్హత సాధించలేకపోయినట్లు ఆమె చెప్పింది. మూడేళ్లుగా భారత నంబర్‌వన్ క్రీడాకారిణిగా తానే ఉండటాన్ని ప్రస్తావించింది. 2020 ఒలింపిక్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్న ఆమె... ఈ క్రమంలో ఆసియా క్రీడల్లో రాణించాలని భావిస్తోంది.