'టీమిండియాను నంబర్ వన్ చేస్తా'
ముంబై: టీమిండియాను అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్ గా నిలిపేందుకు కృషి చేస్తానని బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అనురాగ్ ఠాకూర్ అన్నారు. మహిళా క్రికెట్ అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులు పెంచుతామని, వారికి కాంట్రాక్టులు అమలు చేస్తామని చెప్పారు. మరిన్ని మహిళా క్రికెట్ టోర్నమెంట్ లు నిర్వహిస్తామన్నారు.
టీమిండియా ప్రక్షాళనకు జస్టిస్ లోధా కమిటీ ప్రతిపాదించిన వాటిని అమలు చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. టీమిండియా ప్రధాన కోచ్ పదవికి ప్రకటన ఇస్తామని, సమర్ధులు జూన్ 10లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాతే కోచ్ ను ఎంపిక చేస్తామని చెప్పారు.
దేశీయ టోర్నమెంట్లు, సిరీస్ ల ద్వారానే బీసీసీఐకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తోందని వెల్లడించారు. రాష్ట్రాలు, కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదని అన్నారు. రూ 100 కోట్లతో క్రికెట్ మైదానాలను పర్యావరణహితంగా మారుస్తామని, అభిమానులకు పెద్దపీట వేస్తామని ఠాకూర్ తెలిపారు.