పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాది (2023) సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్ వన్డే టోర్నీలో భారత్ పాల్గొనేది లేదంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన వ్యాఖ్యలు దూమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వివాదాస్పద అంశంపై తాజాగా బీసీసీఐ కొత్త బాస్ రోజర్ బిన్నీ స్పందించాడు. జై షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బిన్నీ ఓ ప్రకటన విడుదల చేశాడు.
భారత జట్టు పాకిస్తాన్‌లో పర్యటించాలా వద్దా అన్న అంశం భారత ప్రభుత్వం పరిధిలోని అంశమని, ఈ విషయంలో కేంద్ర నిర్ణయాన్ని బీసీసీఐ ఫాలో అవ్వాల్సిందే తప్పించి, సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు భారత క్రికెట్ బోర్డుకు లేదని బీసీసీఐ అధ్యక్ష హోదాలో బిన్నీ వివరణ ఇచ్చాడు. ఈ విషయమై ప్రస్తుతానికి బీసీసీఐ కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించలేదని, ఒకవేళ కేంద్రం నుంచి ఏవైనా కీలక ఆదేశాలు వస్తే మీడియాకు తప్పక తెలియజేస్తామని స్పష్టం చేశాడు.
కాగా, ఇదే అంశంపై కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా స్పందించాడు. భారత జట్టు పాకిస్తాన్‌లో పర్యటించాలంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని, ప్రస్తుతానికి ఈ విషయం కేంద్ర ప్రభుత్వం పరిశీలనలోకి రాలేదని ఆయన వివరించాడు. ఇదిలా ఉంటే, జై షా చేసిన ప్రకటనపై ఉలిక్కపడ్డ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. ఆసియా కప్ ఆడేందుకు భారత్ పాక్‌లో అడుగుపెట్టకపోతే, భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో పాక్ కూడా పాల్గొనబోదని బెదిరింపులకు దిగింది.
Comments
Please login to add a commentAdd a comment