సిస్టర్స్ సులభంగా... | Williams sisters return to Wimbledon semi-final; Sania Mirza falls | Sakshi
Sakshi News home page

సిస్టర్స్ సులభంగా...

Published Wed, Jul 6 2016 12:38 AM | Last Updated on Wed, Sep 18 2019 2:58 PM

సిస్టర్స్ సులభంగా... - Sakshi

సిస్టర్స్ సులభంగా...

* వింబుల్డన్ సెమీస్‌లో సెరెనా, వీనస్
* కెర్బర్, వెస్నినా కూడా...

లండన్: డిఫెండింగ్ చాంపియన్ హోదాను కొనసాగిస్తూ చెల్లెలు... ఏడేళ్ల తర్వాత సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంటూ అక్క... వింబుల్డన్‌లో అమెరికా సిస్టర్స్ సెరెనా, వీనస్‌లు చెలరేగిపోయారు. స్థాయికి తగ్గ ప్రదర్శనతో ప్రత్యర్థులపై ఆధిపత్యం కొనసాగిస్తూ టైటిల్ దిశగా మరో అడుగు ముందుకు వేశారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో టాప్‌సీడ్ సెరెనా 6-4, 6-4తో 21వ సీడ్ అనస్థాసియా పావులుచెంకోవా (రష్యా)పై; 8వ సీడ్ వీనస్ 7-6 (7/5), 6-2తో యారోస్లోవా ష్వెదోవా (కజకిస్తాన్)పై నెగ్గి సెమీస్‌లోకి దూసుకెళ్లారు.

పావులుంచెకోవాతో గంటా 12 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సెరెనా వ్యూహాత్మకంగా ఆడింది. భారీ సర్వీస్‌లతో కాకుండా తెలివిగా చిన్న చిన్న షాట్స్‌తో ప్రత్యర్థిని కట్టిపడేసింది. తొలిసెట్‌లో ఇరువురు చెరో నాలుగు గేమ్‌ల్లో సర్వీస్‌ను నిలబెట్టుకున్నారు. కానీ తొమ్మిదో గేమ్‌లో పావులుచెంకోవా సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా.. ఆ వెంటనే సర్వీస్‌ను కాపాడుకుని సెట్‌ను నిలబెట్టుకుంది. రెండోసెట్‌లోనూ ఇదే తరహా ఫలితాన్ని పునరావృతం చేసి సెట్‌ను, మ్యాచ్‌ను చేజిక్కించుకుంది.
 
మార్టినా నవ్రోతిలోవా (1994లో) తర్వాత వింబుల్డన్ సెమీస్‌కు చేరిన ఎక్కువ వయసు మహిళగా రికార్డులకెక్కిన 36 ఏళ్ల వీనస్... క్వార్టర్స్ మ్యాచ్‌లో ఆకట్టుకుంది. 2008లో చివరిసారి ఇక్కడ టైటిల్ గెలిచిన వీనస్... 2010 యూఎస్ ఓపెన్  తర్వాత మళ్లీ గ్రాండ్‌స్లామ్‌లో సెమీస్‌కు చేరడం ఇదే తొలిసారి. ష్వెదోవాతో గంటా 42 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో ఇరువురు సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో స్కోరు 6-6తో సమమైంది. అయితే టైబ్రేక్‌లో వీనస్ వరుసగా సర్వీస్‌లను కాపాడుకుంటూ సెట్‌ను చేజిక్కించుకుంది. ఇక రెండోసెట్‌లో ఒకసారి సర్వీస్‌ను కోల్పోయిన వీనస్ మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌ను మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.  ఇతర క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో నాలుగోసీడ్ కెర్బర్ (జర్మనీ)
 
7-5, 7-6 (7/2)తో ఐదోసీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై; ఎలెనా వెస్నినా (రష్యా) 6-2, 6-2తో 19వ సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా)పై గెలిచారు. సెమీస్‌లో సెరెనా... వెస్నినాతో; వీనస్... కెర్బర్‌తో తలపడతారు.
 
సానియా జోడీకి చుక్కెదురు
మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత స్టార్ సానియా మీర్జా-ఇవాన్ డుడిగ్ (క్రొయేషియా) జోడికి చుక్కెదురైంది. రెండోరౌండ్‌లో టాప్‌సీడ్ సానియా-డుడిగ్ 6-4, 3-6, 5-7తో బ్రిటన్ జంట నీల్ స్కుపిస్కీ-అనా స్మిత్‌ల చేతిలో ఓడారు. దాదాపు రెండు గంటలకుపైగా సాగిన ఈ మ్యాచ్‌లో రెండు జోడీలు చెరో సెట్‌ను సాధించాయి. మూడో గేమ్‌లో బ్రేక్ పాయింట్‌తో తొలిసెట్‌ను చేజిక్కించుకున్న సానియా ద్వయం... రెండోసెట్‌లో వరుసగా సర్వీస్‌లను చేజార్చుకున్నారు.

ఇక నిర్ణయాత్మక మూడో సెట్‌లో ఓ దశలో సానియా-డుడిగ్ 5-3 ఆధిక్యంలో నిలిచారు. అయితే కీలకమైన తొమ్మిదో గేమ్‌లో స్కోరు 40-30 వద్ద మ్యాచ్ పాయింట్‌ను చేజార్చుకున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న బ్రిటన్ జోడి భారీ సర్వీస్‌లతో చెలరేగిపోయింది. మరోసారి మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకుని ప్రత్యర్థి ఆధిక్యాన్ని 4-5కు తగ్గించారు. తర్వాత సర్వీస్‌ను కాపాడుకుని మ్యాచ్‌లో నిలిచారు. ఇక 11వ గేమ్‌లో సానియా జోడి సర్వీస్‌ను బ్రేక్ చేయడంతో పాటు 12వ గేమ్‌లో తమ సర్వీస్‌ను నిలబెట్టుకుని సెట్‌ను మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. బాలికల రెండోరౌండ్‌లో కర్మన్ కౌర్ (భారత్) 6-4, 2-6, 2-6తో  బోల్క్‌వెడ్జ్ (జార్జియా) చేతిలో ఓడింది.  మిక్స్‌డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో  రోహన్ బోపన్న (భారత్)-రొడినోవా (ఆస్ట్రేలియా) జంటకు ఓటమి ఎదురైంది. కొలంబియా ద్వయం కాబెల్-మారినో 7-6 (7/5), 6-3తో బోపన్న జోడిపై నెగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement